హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్

- September 06, 2026 , by Maagulf
హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వివాహాలు, గృహప్రవేశాలు మరియు ఇతర శుభకార్యాల సమయంలో హిజ్రాలు (ట్రాన్స్‌జెండర్లు) అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులపై రాష్ట్ర డిజిపి సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. ఇటీవల ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫిర్యాదులు తన దృష్టికి ఎక్కువగా వస్తున్నాయని ఆయన తెలిపారు. గతంలో తాను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ఈ తరహా వేధింపులను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని గుర్తుచేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అక్రమ వసూళ్లను అడ్డుకునేందుకు పోలీస్ కమిషనర్లకు సూచనలు జారీ చేసి, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ప్రత్యేక డ్రైవ్ (Special Drive) నిర్వహిస్తామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

సేవల్లో ఆదర్శం: ట్రాన్స్‌జెండర్ల సేవలను ప్రశంసించిన డిజిపి
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూనే, సమాజంలో బాధ్యతాయుతంగా పనిచేస్తున్న ట్రాన్స్‌జెండర్ల సేవలను డిజిపి అభినందించారు. ప్రభుత్వ విభాగాలు మరియు ప్రజా సేవల్లో వారు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా హైడ్రా (HYDRAA) విభాగంలో మరియు నగరంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా అనేకమంది ట్రాన్స్‌జెండర్లు ఎలాంటి ఫిర్యాదులు లేకుండా, ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. చట్ట వ్యతిరేక చర్యలకు దూరంగా ఉంటూ, పద్ధతిగా సమాజంలో జీవనం సాగించేలా ప్రోత్సహిస్తూనే, బలవంతపు వసూళ్లకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com