ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్

- September 06, 2026 , by Maagulf
ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్

హైదరాబాద్‌: ఉన్నత విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు నిరంతరం సంస్కరణలు చేపట్టి, పరిశోధన, ఆవిష్కరణలు, జ్ఞాన సృష్టికి ప్రాధాన్యమివ్వాలని  గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా యువతను జ్ఞానం, నైపుణ్యాలతో తీర్చిదిద్దడంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.

జాతీయ  ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు గవర్నర్‌ శుభాకాంక్షలు తెలిపారు. దేశ నిర్మాణంలో, భవిష్యత్‌ తరాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి (TGCHE) ప్రచురించిన *‘తెలంగాణ జర్నల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’ (TJHE) వాల్యూమ్‌–2, సంచిక–1*ను గవర్నర్‌ విడుదల చేశారు. *“Universities in the Twenty-First Century: Renewal, Reforms and Roadmaps”* అనే ఇతివృత్తంతో వెలువడిన ఈ జర్నల్‌ ఉన్నత విద్యారంగంలో సమకాలీన అంశాలపై పరిశోధనాత్మక చర్చకు దోహదపడుతుందని అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం, మారుతున్న నైపుణ్య అవసరాలు, ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు తమ విద్యా విధానాలను పునరుద్ధరించుకోవాలని గవర్నర్‌ సూచించారు. అంతరశాఖా విద్య, పరిశోధన–ఆవిష్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తూ విద్యా ప్రమాణాలను బలోపేతం చేయాలని అన్నారు.

TJHE వంటి అకడమిక్‌ వేదికలు పరిశోధకులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, విధాన నిర్ణేతల మధ్య జ్ఞాన మార్పిడికి, ఉన్నత విద్యపై సమర్థవంతమైన విధాన చర్చలకు దోహదపడతాయని పేర్కొన్నారు. జర్నల్‌కు ISSN నెట్‌వర్క్‌ ద్వారా ఆన్‌లైన్‌, ప్రింట్‌ ISSN గుర్తింపు లభించడం అభినందనీయమన్నారు.

TGCHE ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ వి. బాలకిష్టారెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో పరిశోధనా సంస్కృతి, అకడమిక్‌ ఎక్సలెన్స్‌ను బలోపేతం చేసేందుకు చేస్తున్న కృషిని గవర్నర్‌ అభినందించారు.

సెప్టెంబర్‌ 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న *Research Education Advancement Conclave in Hyderabad (REACH)–2026* గురించి Telangana Higher Education Council (TGCHE) ఛైర్మన్  ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి గవర్నర్‌కు వివరించారు. పరిశోధన, ఆవిష్కరణలు, సంస్థల మధ్య సహకారం, ఉన్నత విద్య భవిష్యత్‌పై ఈ సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో TGCHE కార్యదర్శి ప్రొఫెసర్‌ శ్రీరామ్‌ వెంకటేష్‌ పాల్గొన్నారు.
అంతకుముందు కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ (SKLTGHU) వైస్-ఛాన్సలర్,  డాక్టర్ డి.రాజి రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ , ప్రముఖ బ్రెస్ట్ క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ పి. రఘు రామ్ లు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ను లోక్ భవన్ లో కలిశారు . 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com