పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- July 21, 2026
మనామా: పిల్లలు చదువు, వినోదం, స్నేహితులతో సంభాషణ కోసం ఇంటర్నెట్ను ఎక్కువగా వినియోగిస్తున్న నేపథ్యంలో వారి ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ (MOI) సూచించింది. అవగాహన కల్పించడం, సరైన మార్గనిర్దేశం చేయడం, పిల్లలతో నిరంతరం మాట్లాడడం ద్వారా సైబర్ ముప్పుల నుంచి వారిని రక్షించవచ్చని పేర్కొంది. మంత్రిత్వ శాఖకు చెందిన చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్ సైబర్‌స్పేస్ యూనిట్ కుటుంబాలు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని ఏర్పరచుకునేందుకు పలు సూచనలను విడుదల చేసింది. పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు తెలుసుకోవడంతో పాటు వారి డిజిటల్ అనుభవాలపై తరచూ చర్చించాలని సూచించింది.
పిల్లలు ఉపయోగించే మొబైల్ ఫోన్లు, యాప్‌లు, సోషల్ మీడియా ఖాతాల్లో ప్రైవసీ సెట్టింగ్‌లు తప్పనిసరిగా అమలు చేయాలని, అలాగే వయస్సుకు తగిన కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండేలా పేరెంటల్ కంట్రోల్ సదుపాయాలను వినియోగించాలని సూచించింది.బలమైన పాస్వర్డ్లు ఏర్పాటు, వాటిని ఇతరులతో పంచుకోకూడదని పిల్లలకు నేర్పించాలని తెలిపింది. తెలియని వ్యక్తులతో చాట్ చేయడం, అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించడం వల్ల కలిగే ప్రమాదాలపై కూడా అవగాహన కల్పించాలని పేర్కొంది. పిల్లల ఆన్లైన్ అనుభవాల గురించి తరచూ మాట్లాడడం, వారి సందేహాలు, సమస్యలను శ్రద్ధగా వినడం, ఏదైనా అనుమానాస్పద విషయం ఎదురైతే భయపడకుండా చెప్పేలా వారికి ధైర్యం కల్పించాలని సూచించింది.
అలాగే స్క్రీన్ టైమ్‌కు పరిమితులు విధించి, డిజిటల్ వినియోగం, విశ్రాంతి, రోజువారీ కార్యకలాపాల మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూడాలని పేర్కొంది. పిల్లలు ఉపయోగించే యాప్‌లు, గేమ్స్, వెబ్సైట్ల గురించి తల్లిదండ్రులు తెలుసుకుని వాటిలో ఉండే ప్రమాదాలను గుర్తించాలని సూచించింది.అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకూడదని, తెలియని ఫైళ్లు డౌన్లోడ్ చేయకూడదని పిల్లలకు సూచించాలని తెలిపింది. అలాంటి చర్యల వల్ల మాల్వేర్, మోసాలు, హానికరమైన కంటెంట్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. సురక్షితమైన డిజిటల్ వాతావరణం ఏర్పడాలంటే తల్లిదండ్రులు, పిల్లలు, ప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేయాలని, సైబర్ ముప్పులను ఎదుర్కోవడంలో అవగాహనే తొలి రక్షణ అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, పిల్లల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంచేందుకు "టుగెదర్ డిజిటల్ సమ్మర్ ప్రోగ్రామ్" ద్వారా ప్రముఖ గేమింగ్ వేదిక రోబ్లాక్స్ లో ఇంటరాక్టివ్ లెసన్స్ రూపంలో సైబర్ సెక్యూరిటీ, బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రవర్తనపై శిక్షణ కూడా అందిస్తోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







