పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- July 27, 2026
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PM Internship Scheme–PMIS) అమలు, ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా వారీ పురోగతి, పథకంలో చేసిన మార్పులు, విద్యార్థులకు అందుతున్న ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక వివరాలను వెల్లడించింది. మచిలీపట్నం లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఈ సమాచారాన్ని అందించింది.
కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, పీఎం ఇంటర్న్‌షిప్ పథకం మూడో విడత ప్రస్తుతం కొనసాగుతోంది. సవరించిన మార్గదర్శకాలతో ఈ విడతను 2026 మార్చి 20న ప్రారంభించారు.
కొత్త మార్గదర్శకాల ప్రకారం పీజీ విద్యార్థులకు కూడా ఈ పథకంలో పాల్గొనే అవకాశం కల్పించారు. అయితే ఎంబీఏ లేదా సమాన అర్హత కలిగిన వారు ఈ పథకానికి అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే అర్హత కలిగిన కంపెనీల పరిధిని కూడా విస్తరించినట్లు తెలిపింది.
యువతకు మరింత ప్రయోజనం చేకూరేలా ఇంటర్న్‌షిప్ వ్యవధిని 6 లేదా 9 నెలలుగా సౌలభ్యంతో అమలు చేయడంతో పాటు, నెలవారీ భృతిని రూ.5,000 నుంచి రూ.9,000కు పెంచారు. అదేవిధంగా వయోపరిమితిని 18 నుంచి 25 సంవత్సరాలకు విస్తరించి, చివరి సంవత్సరం డిగ్రీ, పీజీ విద్యార్థులను కూడా అర్హులుగా చేర్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పురోగతిపై కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం..
తొలి విడత: 203 ఆఫర్లకు గాను 60 మంది అంగీకరించగా, 8 మంది ఇంటర్న్‌లుగా చేరారు.
రెండో విడత: 472 ఆఫర్లకు గాను 105 మంది అంగీకరించగా, 17 మంది చేరారు.
మూడో విడత (2026 జూలై 15 నాటికి): 53 ఆఫర్లకు గాను 31 మంది అంగీకరించగా, 22 మంది ఇంటర్న్‌లుగా చేరారు.
ఈ పథకంలో డ్రాప్అవుట్లను తగ్గించి, పాల్గొనే వారి సంఖ్యను పెంచేందుకు జియో-ట్యాగింగ్, రోలింగ్ ఇంటర్న్‌షిప్ విధానం, అవగాహన కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పరిశ్రమల సంఘాలతో సమన్వయం వంటి చర్యలు చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ, యువతకు ఉపాధి అవకాశాలను విస్తరించే పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, కృష్ణా జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ యువత అధిక సంఖ్యలో ఈ అవకాశాలను వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







