14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా

- July 27, 2026 , by Maagulf
14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన 14వ ఐటీ బోనాలు ఆదివారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో వందలాది మంది ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఎన్నారైలు, విదేశీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

శిల్పారామం నుంచి చిన్నపెద్దమ్మ ఆలయం వరకు సాగిన మహా శోభాయాత్రలో 21 బోనాలు, 21 పోతరాజులు, ఒగ్గు డోలు, డప్పులు, శివసత్తులు తదితర తెలంగాణ జానపద కళారూపాలు కనువిందు చేశాయి. తెలంగాణ జానపద వైభవం, అమ్మవారిపై భక్తి, ఐటీ యువత ఉత్సాహం ఒకేచోట కలిసిన ఈ మహోత్సవం ఐటీ కారిడార్‌ను ఆధ్యాత్మిక, సాంస్కృతిక వాతావరణంతో నింపేసింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందే, తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగుతున్న సమయంలో ఐటీ కారిడార్‌లో తెలంగాణ సంస్కృతిని సజీవంగా నిలబెట్టాలనే సంకల్పంతో 2013లో టిటా ఐటీ బోనాలకు శ్రీకారం చుట్టింది. ఉద్యమ ప్రభావం, పరిపాలనా ఆంక్షలు నెలకొన్న ఆ సమయంలో ఐటీ కారిడార్‌లో బోనాల శోభాయాత్ర నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఆ సందర్భంగా టిటా గ్లోబల్ ప్రెసిడెంట్ సుందీప్ కుమార్ మక్తాలపై పోలీసు కేసు నమోదైనా, తెలంగాణ సంస్కృతిని ఐటీ యువతకు చేరువ చేయాలనే సంకల్పంతో ప్రారంభమైన ఈ మహోత్సవం ఎక్కడా ఆగకుండా ప్రతి ఆషాఢ మాసం రెండో ఆదివారం ఆనవాయితీగా కొనసాగుతూ నేడు 14వ సంవత్సరానికి చేరుకుంది.

ఈ ఏడాది నూతన విగ్రహ ప్రతిష్ఠ అనంతరం చిన్నపెద్దమ్మ ఆలయంలో నిర్వహించిన తొలి ఐటీ బోనాలు కావడం మరో విశేషంగా నిలిచింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా టిటా తొలి బోనం సమర్పించిన అనంతరం సుందీప్ కుమార్ మక్తాల కుటుంబ సభ్యులు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా ఒడిబియ్యం సమర్పించారు. ఈ ఆనవాయితీ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులతో మహా శోభాయాత్ర కొనసాగింది. అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాదం (అన్నదానం) ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా టిటా గ్లోబల్ ప్రెసిడెంట్ సుందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రారంభమైన ఐటీ బోనాలు నేడు ఐటీ ఉద్యోగుల సొంత సాంస్కృతిక పండుగగా రూపుదిద్దుకున్నాయి. ప్రతి ఆషాఢం రెండో ఆదివారం ఈ మహోత్సవాన్ని ఆనవాయితీగా నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు తెలంగాణ సంస్కృతిని, అమ్మవారిపై భక్తిని చేరవేయడం మనందరి బాధ్యత. ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసిన ఐటీ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు, కళాకారులకు, భక్తులకు, స్వచ్ఛంద సేవకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటా సభ్యులు భగ్యలక్ష్మి వాకిటి, పంచలింగాల అక్షితా రెడ్డి, కీర్తన్ రాజ్, పరిడాల దినేష్ చౌదరి, చింతపల్లి మాధవ్ సాయి విశ్వేశ్, రాళ్లపల్లి వెంకట రోహిత్ కుమార్, మోదుమూడి పవన్ రాజా, అనిల్ చిన్నగారి, అభిలాష్ రంగినేని తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com