విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

- July 29, 2026 , by Maagulf
విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

మస్కట్: విదేశాల నుంచి స్వీట్లు లేదా సంప్రదాయ ఆహార పదార్థాలను తీసుకెళ్లే ప్రయాణికులు ముందుగా వాటిలో ఉపయోగించిన పదార్థాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఒమాన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. గమ్యదేశంలోని కస్టమ్స్ నిబంధనలను తెలుసుకోకుండా ఆహార పదార్థాలను తీసుకెళ్తే చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని సూచించారు. ఇటీవల బీహార్‌కు చెందిన భారతీయ ప్రవాసి సతీష్‌ను జూలై 23న అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద పాపీ సీడ్స్ (ఖస్ ఖస్/పోస్తా దానా/గసగసాలు) కలిగిన భారతీయ సంప్రదాయ స్వీట్లు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.

భారతదేశంలో గసగసాలను స్వీట్లు, హల్వా, కూరల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే ఒమాన్‌తో పాటు పలు గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల్లో గసగసాల దిగుమతి, ఎగుమతిపై నిషేధం లేదా కఠిన నియంత్రణలు అమల్లో ఉన్నాయి. రాయల్ ఒమాన్ పోలీస్ ప్రకారం, గసగసాలు నిషేధిత మాదక పదార్థాల జాబితాలో ఉండటంతో వాటిని తీసుకెళ్లడం చట్టరీత్యా శిక్షార్హం.సెలవులు ముగించుకుని తిరిగి ఉద్యోగానికి వెళ్తూ సహోద్యోగులకు పంచేందుకు రస్కడం అనే స్వీట్‌ను సతీష్ తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు వెళ్లే దేశంలోని కస్టమ్స్ నిబంధనలను ముందుగానే పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు. భారతదేశంలో చట్టబద్ధంగా విక్రయించే కొన్ని ఆహార పదార్థాలు ఇతర దేశాల్లో నిషేధితమైనవిగా ఉండవచ్చని, తెలియక తీసుకెళ్లినా వస్తువుల స్వాధీనం, జరిమానాలు, నిర్బంధం లేదా న్యాయపరమైన చర్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇదే సమయంలో ఒమాన్ కస్టమ్స్ కూడా నిషేధిత వస్తువులపై అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేసింది. జీసీసీ యూనిఫైడ్ కస్టమ్స్ చట్టం ప్రకారం పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, సైనిక సామగ్రి, నిజమైన తుపాకులను పోలి ఉండే బొమ్మ తుపాకులు, సహజ దంతం (ఐవరీ), ఎలక్ట్రిక్ స్టన్ పరికరాలు, నైట్ విజన్ పరికరాలు తదితర వస్తువుల దిగుమతి, ఎగుమతి నిషేధితమని అధికారులు గుర్తు చేశారు.

వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నందున, ప్రయాణానికి ముందు లగేజీలో ఉన్న ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు ఆయాదేశ చట్టాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. కొద్ది నిమిషాల ముందస్తు పరిశీలనతో అనవసరమైన చట్టపరమైన సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com