ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- July 31, 2026
మనామా: మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా యాప్‌లు, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి మానవ అక్రమ రవాణా ముఠాలు కొత్త మార్గాల్లో అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని బహ్రెయిన్ ఎంపీ హసన్ ఇబ్రాహీం హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చట్టాలు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్ మోసాలు, డిజిటల్ దోపిడీ ప్రస్తుతం అత్యంత వేగంగా పెరుగుతున్న ముప్పులుగా మారాయని తెలిపారు. నేరగాళ్లు సోషల్ మీడియా, మొబైల్ యాప్‌ల ద్వారా బాధితులను గుర్తించి, మోసపూరితంగా వలలో వేసుకుంటున్నారని చెప్పారు. ఈ పరిస్థితులను ఎదుర్కోవాలంటే మానవ అక్రమ రవాణా నిరోధక చట్టాలను తరచుగా సమీక్షించాలని, పోలీసు అధికారులు, న్యాయమూర్తులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని హసన్ ఇబ్రాహీం సూచించారు.
బహ్రెయిన్ ప్రభుత్వం ఇప్పటికే మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు, కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు, అక్రమ ముఠాలను గుర్తించి చర్యలు తీసుకోవడానికి, బాధితులకు సహాయం అందించడానికి పటిష్టమైన చట్టాలు, ప్రభుత్వ వ్యవస్థలను అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా అంతర్జాతీయ సమస్యగా మారిందని, దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే, బహ్రెయిన్ వరుసగా ఎనిమిదో ఏడాది కూడా అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన "ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ (TIP) రిపోర్ట్"లో టయర్-1 స్థానాన్ని నిలబెట్టుకోవడం దేశం మానవ అక్రమ రవాణా నిరోధంలో సాధిస్తున్న విజయాలకు నిదర్శనమని హసన్ ఇబ్రాహీం తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







