వరంగల్–కరీంనగర్ నేషనల్ హైవే

- August 03, 2026 , by Maagulf
వరంగల్–కరీంనగర్ నేషనల్ హైవే

ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల మధ్య రవాణా వ్యవస్థను సరికొత్త పుంతలు తొక్కించేలా నిర్మిస్తున్న నాలుగు లైన్ల జాతీయ రహదారి త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే 85 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టు ద్వారా ఇరు జిల్లాల మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఆధ్వర్యంలో 68 కిలోమీటర్ల పొడవున రూ.1,641 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారి నిర్మాణం జరుగుతోంది. ఇందులో 23 వెహికల్ అండర్ పాస్‌లు, 121 బ్లాక్ కల్వర్టులు, మానకొండూర్ వద్ద ప్రత్యేక బైపాస్, తిమ్మాపూర్ వద్ద చిన్న బ్రిడ్జి ఉన్నాయి. ఈ రోడ్డు ఎన్‌హెచ్-163 (NH-163)కి అనుసంధానమవుతుంది. ఇది పలివెల్పుల శివారులో ప్రారంభమై ఎల్లాపూర్, ఎల్కతుర్తి, తిమ్మాపూర్, కేశవపట్నం, నుగునూర్ గుండా మానకొండూర్ బైపాస్ వరకు సాగుతుంది. హనుమకొండ నుంచి ఎర్రగట్టు గుట్ట దగ్గర పరకాల రోడ్డు, గంటూర్ పల్లి రోడ్డు, హసన్ పర్తి మరియు ఎల్లాపూర్ వద్ద నుంచి ప్రయాణికులు ఈ కొత్త హైవేపైకి ప్రవేశించవచ్చు.

తగ్గనున్న సమయం & ఇంధన పొదుపు
సమయం ఆదా:
గతంలో వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్లాలంటే దాదాపు రెండున్నర గంటల సమయం పట్టేది. ఈ నాలుగు లైన్ల ఎన్‌హెచ్-563 అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం సుమారు ఒక గంట వరకు తగ్గుతుంది.
ఖర్చులు తగ్గింపు: ప్రయాణ సమయం తగ్గడంతో పాటు భారీగా ఇంధన వినియోగం కూడా తగ్గి వాహనదారులకు ఆర్థిక భారం తప్పుతుంది.
పారిశ్రామిక పురోగతి & ఉపాధి అవకాశాలు
ఇండస్ట్రియల్ కారిడార్: ఈ హైవే వెంబడి రెండు ఉమ్మడి జిల్లాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ మరింత వేగంగా విస్తరించేందుకు మార్గం సుగమమవుతుంది.
వ్యాపార రవాణా: గ్రానేట్ పరిశ్రమలతో పాటు భవన నిర్మాణ సామగ్రి, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు ఈ రహదారి ఎంతో అనుకూలంగా మారుతుంది.
విద్యా, వైద్య రంగాలు: ఈ ప్రాంతంలో నూతన విద్య, వైద్య శిక్షణ సంస్థలు, ముడి సరుకుల ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు పెరుగుతాయి. వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం నుంచి కరీంనగర్‌లోని ఎలగందల కోట, ప్రధాన జలాశయాలను సందర్శించే పర్యాటకులకు రాకపోకలు సులభతరం కానున్నాయి. రహదారికి ఇరువైపులా వివిధ రకాల మొక్కలను పెంచడంతో పాటు, వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు రోడ్డు పొడవునా ప్రత్యేక నిర్మాణాలను చేపట్టనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com