మద్యం మత్తులో డ్రైవింగ్‌.. బహ్రెయిన్‌లో ఘోర ప్రమాదం

- August 04, 2026 , by Maagulf
మద్యం మత్తులో డ్రైవింగ్‌.. బహ్రెయిన్‌లో ఘోర ప్రమాదం

మనామా: బహ్రెయిన్‌లో మద్యం మత్తులో వాహనం నడిపిన ఓ డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.

అధికారుల వివరాల ప్రకారం, ఈ ప్రమాదం అల్-సయా (Al-Saya) ప్రాంతంలో జరిగింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ ముందుగా వెళ్తున్న ప్రయాణికులతో ఉన్న బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు.

ప్రమాదం ధాటికి బస్సు అదుపు తప్పి రోడ్డుపై నుంచి పక్కకు దూసుకెళ్లి ఇనుప, కాంక్రీట్ భద్రతా అవరోధాలను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది వివిధ స్థాయిల్లో గాయపడ్డారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఘటన అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. నిందితుడిని విచారించిన అనంతరం, తదుపరి దర్యాప్తు పూర్తయ్యే వరకు రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది.

మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత నిందితుడిపై క్రిమినల్ కోర్టులో అభియోగాలు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com