ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- August 07, 2026
అబుదాబి: కుటుంబ సభ్యులు, స్నేహితుల వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే సందేశాలను నిజానిజాలు తెలుసుకోకుండా ఫార్వర్డ్ చేయొద్దని యూఏఈ టెలికమ్యూనికేషన్స్ అండ్ డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (TDRA) ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది. మంచి ఉద్దేశంతో పంపిన తప్పుడు సమాచారం కూడా వేగంగా వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించింది.
నకిలీ లేదా తప్పుదోవ పట్టించే సందేశాలను గుర్తించేందుకు కొన్ని సాధారణ లక్షణాలను పరిశీలించాలని టిడిఆర్ఏ సూచించింది. అనుమానాస్పద వెబ్సైట్ లింకులు, అక్షరదోషాలు, అసహజమైన లేఅవుట్లు లేదా అసంపూర్ణ సమాచారంతో ఉన్న సందేశాలను వెంటనే ఫార్వర్డ్ చేయకుండా జాగ్రత్త వహించాలని పేర్కొంది.
అలాగే ఏదైనా సమాచారాన్ని ఇతరులకు పంపే ముందు అది విశ్వసనీయ వార్తా సంస్థలు లేదా అధికారిక ప్రభుత్వ వనరుల్లో ప్రచురించబడిందో లేదో తప్పనిసరిగా ధృవీకరించాలని సూచించింది. ఒకవేళ ఎవరైనా తెలియక తప్పుడు సమాచారాన్ని పంపితే, వారిని మర్యాదపూర్వకంగా సరిదిద్దడం ద్వారా తప్పుడు ప్రచారం మరింత వ్యాపించకుండా నివారించవచ్చని తెలిపింది.
వాట్సాప్ గ్రూపులకూ సైబర్ చట్టాలు వర్తిస్తాయి
యూఏఈ సైబర్ నేరాల చట్టాల నుంచి వ్యక్తిగత వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా గ్రూపులకు మినహాయింపు లేదని న్యాయ నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. ధృవీకరించని సమాచారం ఫార్వర్డ్ చేయడం, ఇతరుల వ్యక్తిగత సంభాషణలు లేదా ఫొటోలను అనుమతి లేకుండా పంచుకోవడం, తప్పుడు లేదా పరువునష్టం కలిగించే పోస్టులను మళ్లీ షేర్ చేయడం వంటి చర్యలకు చట్టపరమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు.
న్యాయవాది సామ్ మూర్ మాట్లాడుతూ, చాలా మంది వ్యక్తిగత చాట్లు, వాట్సాప్ గ్రూపులు చట్టాలకు అతీతమని భావిస్తారని, కానీ అది పూర్తిగా తప్పని అన్నారు. తప్పుడు, అవమానకరమైన లేదా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని పోస్ట్ చేయడం లేదా ఫార్వర్డ్ చేయడం వల్ల చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఆయన వివరించిన ప్రకారం, ధృవీకరించని వార్తలు, వీడియోలు లేదా సందేశాలను ఫార్వర్డ్ చేయడం అత్యంత సాధారణ తప్పిదమని చెప్పారు. యూఏఈ సైబర్ క్రైమ్ చట్టం ప్రకారం, ఒక సందేశాన్ని ఫార్వర్డ్ చేయడం కూడా దానిని మళ్లీ ప్రచురించినట్లే (Re-publication) పరిగణించబడుతుంది. ఆ సమాచారాన్ని తాము సృష్టించకపోయినా, దానిని ఇతరులకు పంపిన వ్యక్తి కూడా చట్టపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.
ఉద్దేశం కాదు.. ప్రభావమే కీలకం
మరో న్యాయ నిపుణుడు డాక్టర్ హసన్ ఎల్హైస్ మాట్లాడుతూ, వాట్సాప్, ఈమెయిల్ లేదా సోషల్ మీడియాలో కంటెంట్‌ను ఫార్వర్డ్ చేయడాన్ని యూఏఈ కోర్టులు కొత్త ప్రచురణగా పరిగణిస్తున్నాయని తెలిపారు.
దర్యాప్తులో చాట్ లాగ్‌లు, స్క్రీన్షాట్లు, మెటాడేటా వంటి డిజిటల్ ఆధారాలను అధికారులు వినియోగించవచ్చని, సందేశాన్ని పంపిన వ్యక్తికి దురుద్దేశం లేకపోయినా, అది సమాజంపై చూపిన ప్రభావాన్ని కోర్టులు ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటాయని ఆయన పేర్కొన్నారు.
అందువల్ల ఏ సమాచారం వచ్చినా నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే ఇతరులకు పంపాలని, అధికారిక వనరులను మాత్రమే విశ్వసించాలని టిడిఆర్ఏ ప్రజలకు సూచించింది.
తాజా వార్తలు
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్‌వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!
- సౌదీ–టర్కీ–పాకిస్థాన్ మధ్య 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'..
- జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష
- ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్‌పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ







