జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష

- August 07, 2026 , by Maagulf
జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్  సమీక్ష

హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయాన్ని పెంచడంతో పాటు పన్నుల వసూళ్లను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వ్యవస్థను వినియోగించే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్లో ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేయడం, ఆదాయ వనరులను పెంచడం, సాంకేతికత ఆధారంగా పన్ను వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

సమావేశంలో ముఖ్యంగా జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చ జరిగింది. జీఎస్టీ అధికారులకు ఏఐ ఆధారిత సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి, పన్నుల పర్యవేక్షణను మరింత సులభతరం చేయాలని నిర్ణయించారు.

వ్యాపార సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరిగేలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు అనుగుణంగా సాంకేతికతను వినియోగించాలని డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్ సూచించారు.

పన్నుల లీకేజీలను అరికట్టేందుకు శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో పన్నుల ఎగవేతను నియంత్రించేందుకు మున్సిపల్, రెరా, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖలను ఏఐ ఆధారిత సమగ్ర వ్యవస్థతో అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు.

భారీ భవనాలు, కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామగ్రి అవసరాలు, అంచనా వ్యయం, చెల్లించాల్సిన పన్నుల వివరాలను నమోదు చేసే విధానాన్ని రూపొందించాలని సీఎం సూచించారు.

అదేవిధంగా, మీసేవ, ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సమగ్ర డేటా వ్యవస్థలో అనుసంధానం చేస్తే పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె.రామకృష్ణారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎక్సైజ్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com