కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేసే వేదిక ‘అమరావతి చిత్రకళా వీధి’: మంత్రి దుర్గేష్
- August 08, 2026
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ కళాకారుల సృజనాత్మకతను, రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘అమరావతి చిత్రకళా వీధి’ అద్భుతమైన వేదికగా నిలుస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని కొరిటేపాడు–విద్యానగర్ రోడ్డులో ఆగస్టు 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న ‘అమరావతి చిత్రకళా వీధి’ ఉత్సవం శనివారం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం, కళాకారుల సృజనాత్మక ప్రతిభను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పే ఉద్దేశంతో ‘అమరావతి చిత్రకళా వీధి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తున్న కళాఖండాలు రాష్ట్ర కళాకారుల అద్భుత ప్రతిభకు నిదర్శనమని అన్నారు.
గతంలో కళాకారుల ప్రతిభ ఆర్ట్ గ్యాలరీల నాలుగు గోడలకే పరిమితమయ్యేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని మంత్రి చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో కళలను ప్రదర్శించడం ద్వారా కళాకారులకు విస్తృత గుర్తింపు లభించే అవకాశం ఏర్పడిందన్నారు.
ఇప్పటికే రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించిన ‘అమరావతి చిత్రకళా వీధి’ని ఈసారి గుంటూరులో నిర్వహిస్తున్నామని, ఇకపై ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు కళలు, సంస్కృతికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని దుర్గేష్ తెలిపారు. గత ఐదేళ్లలో మసకబారిన సాంస్కృతిక రంగానికి పూర్వవైభవం తీసుకురావడానికి చర్యలు చేపట్టామని, కళాకారులను ఉగాది కళారత్న, కందుకూరి పురస్కారాలతో సత్కరించినట్లు గుర్తుచేశారు.
విద్యార్థులు తమకు ఇష్టమైన కళారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు, స్థానిక ప్రజలు ‘అమరావతి చిత్రకళా వీధి’ని సందర్శించి కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
ఇది కేవలం చిత్రకళా ప్రదర్శన మాత్రమే కాదని, కళాకారులు, విద్యార్థులు, కళాభిమానులు, సాధారణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే సృజనాత్మక ఉద్యమమని మంత్రి అభివర్ణించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ కళా వైభవానికి జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని, సంప్రదాయ కళారూపాలకు ప్రోత్సాహం లభించడంతో పాటు యువతలో కళల పట్ల ఆసక్తి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సంప్రదాయ కళలకు ప్రత్యేక స్థానం
ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ ‘అమరావతి చిత్రకళా వీధి’లో ఏర్పాటు చేసిన అమరావతి శిల్పకళ, కలంకారి, శ్రీకాళహస్తి చిత్రకళ, కొండపల్లి కళలు, తోలుబొమ్మలాట, లేపాక్షి కళా సంప్రదాయాలకు సంబంధించిన స్టాళ్లను సందర్శించారు.
కళాకారులతో మాట్లాడి వారి కళా నైపుణ్యాలను అభినందించారు. వివిధ సంప్రదాయ, జానపద, గిరిజన కళా ప్రదర్శనలతో అతిథులకు స్వాగతం పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహానికి పలువురు ప్రముఖులు నమస్కరించారు.
కార్యక్రమం అనంతరం ఆగస్టు 23న విజయవాడ బందర్ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో మల్లెతీగ సాహిత్య సేవ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘తెలుగు భాష, సంస్కృతిపై కవి సమ్మేళనం’ పోస్టర్‌ను మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, గుంటూరు జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాయపాటి శైలజ, రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి చైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి, నాటక రంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, కళాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ చర్చలు సఫలమైతే తగ్గనున్న ఇంధన ధరలు: ట్రంప్
- షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు రాహుల్ డిమాండ్
- కళాకారుల ప్రతిభను విశ్వవ్యాప్తం చేసే వేదిక ‘అమరావతి చిత్రకళా వీధి’: మంత్రి దుర్గేష్
- ₹220 కోట్లు ఖర్చు చేసి కుక్కలా మారిన 26 ఏళ్ల కోటీశ్వరుడా?
- తెలుగు రాష్ట్రాలకు ఐఎమ్‌డీ అలర్ట్: వచ్చే 5 రోజులు వర్షాలు
- యూఏఈ కస్టమ్స్ చర్యలను సమీక్షించిన షేక్ జాయెద్ బిన్ హమద్
- కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన లులు చైర్మన్ యూసఫ్ అలీ
- కువైట్‌లో ఫ్యామిలీ విజిట్ వీసా నిబంధనల్లో మార్పులు..!!
- అల్ హల్లానియత్ దీవుల వద్ద నౌక ప్రమాదం..!!
- ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో మసీదుల నిర్మాణం.. నిరాశలో స్థానికులు..!!







