హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై క్షిపణి దాడి..సిబ్బంది సురక్షితం

- August 08, 2026 , by Maagulf
హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై క్షిపణి దాడి..సిబ్బంది సురక్షితం

అబుదాబి: హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణిస్తున్న తమ నౌకల్లో ఒకదానిని క్షిపణితో లక్ష్యంగా చేసుకున్నట్లు అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) ధృవీకరించింది. శనివారం (ఆగస్టు 8) తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది.

ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఘటనకు సంబంధించిన సమాచారం కోసం ప్రజలు అధికారిక వర్గాలనే విశ్వసించాలని సూచించింది. పుకార్లు, ధృవీకరించని సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది.

కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తమ సిబ్బంది, ఆస్తులపై జరుగుతున్న దాడులతో కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని అడ్నాక్ శుక్రవారం పేర్కొంది. అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

ఇప్పటి వరకు 15 నౌకల పై దాడులు

సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అడ్నాక్‌కు చెందిన 15 నౌకలు క్షిపణులు, డ్రోన్ల దాడులకు గురైనట్లు కంపెనీ వెల్లడించింది. వీటిలో మూడు దాడులు ఈ వారంలోనే జరిగినట్లు పేర్కొంది.

ఈ దాడుల్లో ఇప్పటివరకు ఒక సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది గాయపడినట్లు అడ్నాక్ తెలిపింది.

ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన మార్గాల్లో హోర్ముజ్ జలసంధి ఒకటి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ మార్గంలో నౌకల భద్రతపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com