క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్..ప్రపంచంలో మూడో స్థానంలో ఒమన్..!!
- August 08, 2026
మస్కట్: జీవన ప్రమాణాల విషయంలో ఒమన్ మరో అంతర్జాతీయ ఘనత సాధించింది. 2026 తొలి అర్ధభాగానికి సంబంధించిన నుంబియే(Numbeo) క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్‌లో ఒమన్ ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది. అదే సమయంలో ఆసియా, అరబ్ దేశాల స్థాయిలో అగ్రస్థానాన్ని కొనసాగించింది. 2025 తొలి అర్ధభాగంలో ఇదే సూచీలో ఒమన్ నాలుగో స్థానంలో నిలిచింది.
అనేక అంతర్జాతీయ సూచీలు ఆర్థిక పనితీరు, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తాయి. అయితే Numbeo క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ ప్రజల రోజువారీ జీవన పరిస్థితులను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది. భద్రత, ప్రజల కొనుగోలు శక్తి, ఆరోగ్య సేవలు, జీవన వ్యయం, ఆస్తుల ధరలు-ఆదాయ నిష్పత్తి, రోజువారీ ప్రయాణ సమయం, కాలుష్య స్థాయి, వాతావరణ అనుకూలత వంటి అంశాలను ఈ సూచీలో పరిగణిస్తారు.
అధిక భద్రత, మెరుగైన కొనుగోలు శక్తి, తక్కువ ఆస్తి ధర-ఆదాయ నిష్పత్తి, తక్కువ స్థాయి కాలుష్యం, తక్కువ సగటు ప్రయాణ సమయం వంటి అంశాలలో మెరుగైన పనితీరు ఒమన్ మూడో స్థానానికి చేరుకోవడంలో కీలకంగా నిలిచాయని నివేదిక పేర్కొన్నది.
జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఒమన్ పట్టణాలు, నగర కేంద్రాల అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. సమగ్ర మాస్టర్ ప్లాన్లు, భవిష్యత్ నగరాల అభివృద్ధి ద్వారా మరింత సమర్థవంతమైన, స్థిరమైన పట్టణ వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతోంది. రాజధాని మస్కట్ పట్టణ రూపురేఖలను మార్చే లక్ష్యంతో చేపట్టిన గ్రేటర్ మస్కట్ ప్రాజెక్ట్ ఈ దిశలో కీలక అడుగుగా నిలుస్తోంది.
సుల్తాన్ హైథమ్ సిటీ నిర్మాణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. దీనితో పాటు అల్ థురయ్యా సిటీ, ఫ్యూచర్ సలాలా సిటీ, అల్ జబల్ అల్ ఆలీ ప్రాజెక్ట్, అల్ ఖువైర్ డౌన్‌టౌన్ వంటి భవిష్యత్ నగరాలు, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరాలను నిర్మించాలన్న సమగ్ర పట్టణాభివృద్ధి వ్యూహంలో భాగంగా వీటిని నిర్మిస్తున్నారు. జీవన ప్రమాణాల సూచీలో ఒమన్ సాధించిన పురోగతి దేశాన్ని అంతర్జాతీయంగా మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
2009లో ప్రారంభమైన Numbeo ప్రపంచవ్యాప్తంగా దేశాలు, నగరాల్లో జీవన వ్యయం, జీవన ప్రమాణాలను పోల్చే అతిపెద్ద డేటాబేస్‌లలో ఒకటిగా ఉంది. భద్రత, ఆరోగ్యం, కాలుష్యం, ట్రాఫిక్, కొనుగోలు శక్తి, ఆస్తుల ధరలు, జీవన వ్యయం తదితర అంశాలకు సంబంధించిన తాజా సమాచారం, వినియోగదారుల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ సూచీలను రూపొందిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసితులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్..
- దీపావళి వేళ యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు
- కువైట్‌లో చోరీకి గురైన 4WD వాహనం లభ్యం..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారు..!!
- ఒమన్‌లో ఆసియాకు చెందిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లకు ఊరట..!!
- దుబాయ్‌లో ఫేక్ పటెక్ ఫిలిప్ వాచ్ విక్రయం.. మహిళకు Dh10,000 ఫైన్..!!
- సౌదీ అరేబియాలో జిమ్‌లు, స్పోర్ట్స్ సెంటర్లకు తుది గడువు..!!
- ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!







