రియాద్‌లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి.. లక్ష్మీనారాయణకు తెలుగు సంఘాల అండ
- August 09, 2026
రియాద్: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ సౌదీ అరేబియాలోని రియాద్‌లో తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాల సమాచారం. గత కొన్ని రోజులుగా ఆయన కుటుంబానికి తెలుగు సామాజిక కార్యకర్తలు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌదీ అరేబియా (TASA), సాటా (SATA) ప్రతినిధులు అండగా నిలుస్తున్నారు.
ఇటీవల లక్ష్మీనారాయణకు గుండె శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం అధిక రక్తపోటు, అధిక రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తడంతో వైద్యులు ఆయనను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అత్యవసర వైద్య సేవలను అందించేందుకు వైద్యులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నట్లు సమాచారం. ఆయన స్పాన్సర్ కూడా చికిత్సకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నట్లు తెలిసింది.
కుటుంబానికి ఎప్పటికప్పుడు సమాచారం
లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు భారత్‌లో ఉండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, తెలంగాణకు చెందిన తెలుగు సామాజిక కార్యకర్త మహమ్మద్ షబ్బీర్ ఆసుపత్రి నుంచి అందుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు చేరవేస్తూ వారికి ధైర్యం కల్పిస్తున్నారు.
ఈ విషయాన్ని జూలై 26, 2026న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏపీఎన్ఆర్టీఎస్ కో-ఆర్డినేటర్‌కు కూడా తెలియజేసినట్లు మహమ్మద్ షబ్బీర్ తెలిపారు.
అయితే, ఆగస్టు 6 నాటికి ఏపీఎన్ఆర్టీఎస్ తరఫున ఎవరూ ఆసుపత్రిని స్వయంగా సందర్శించకపోవడం పట్ల కొందరు తెలుగు ప్రజలు, తెలుగు సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవడం అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.
ఆసుపత్రిని సందర్శించిన తెలుగు సంఘాల ప్రతినిధులు
ఈ నేపథ్యంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌదీ అరేబియా వ్యవస్థాపక అధ్యక్షులు తిరుపతి స్వామి స్వర్ణ (స్వామి), సాటా రియాద్ కోర్ టీమ్ సభ్యులు సింగు నరేష్ కుమార్ తదితరులు ఆసుపత్రిని సందర్శించారు. వైద్యులను కలిసి లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స, ఎదురవుతున్న వైద్యపరమైన సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు.
వైద్యుల నుంచి అందిన సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో వారికి ధైర్యం కల్పించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.
శనివారం తిరుపతి స్వామి స్వర్ణ, ప్రసాద్ జుట్టా, ముకేష్ బద్రి కొప్పినేని మరోసారి ఆసుపత్రిని సందర్శించి వైద్యులను కలిసి లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాజా వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
ప్రస్తుతం లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ, ఆయనను పర్యవేక్షిస్తున్న వైద్యులు తమ వంతు కృషి చేస్తూ అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
లక్ష్మీనారాయణ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో కుటుంబ సభ్యుల మధ్యకు తిరిగి రావాలని సాటా రియాద్ అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ, సాటా కోర్ టీమ్ సభ్యులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, టాసా సభ్యులు, పలువురు తెలుగు సంఘాల ప్రతినిధులు ఆకాంక్షించారు.
ఆపదలో ఉన్న వ్యక్తికి కులం, ప్రాంతం, రాజకీయ అనుబంధం వంటి భేదాలు లేకుండా మానవతా దృక్పథంతో అండగా నిలవడమే నిజమైన తెలుగు స్ఫూర్తి అని పలువురు తెలుగు సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఏపీకి చెందిన వ్యక్తి సౌదీలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త మహమ్మద్ షబ్బీర్‌తో పాటు సాటా ప్రతినిధులు స్పందించి ఆసుపత్రిని సందర్శించడం అభినందనీయమని వారు అన్నారు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







