మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు

- September 27, 2026 , by Maagulf
మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు

అబుదాబి: యూఏఈలో పెరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజో అంతర్జాతీయ మిస్ యూనివర్స్ పోటీలకు సిద్ధమవుతున్న వేళ యూఏఈ టాలరెన్స్ అండ్ కోఎగ్జిస్టెన్స్ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ను కలిశారు.

ఈ భేటీకి సంబంధించిన వీడియోను కజియా మెజో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ సమావేశం తన ప్రయాణంలో ప్రత్యేకమైన ఘట్టమని ఆమె పేర్కొన్నారు. మరింత ఐక్యమైన ప్రపంచాన్ని నిర్మించడంపై షేక్ నహ్యాన్‌తో ఆలోచనలు పంచుకున్నానని, అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టే ముందు ఆయన ఆశీస్సులు అందుకున్నానని తెలిపారు.

యూఏఈలో పెరిగిన కజియా.. భారత్, యూఏఈతో తనకున్న అనుబంధాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాను చేసే ప్రతి పనిలోనూ భారత్‌కు ప్రతినిధిగా ఉండాలని ఎప్పటినుంచో కోరుకున్నానని ఆమె పేర్కొన్నారు. తన మిస్ యూనివర్స్ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని తెలిపారు.

ఇదిలా ఉండగా, సిరియా అధ్యక్షుడి నుంచి తనకు పూలు, కార్డులు బహుమతిగా అందినట్లు చూపించే మరో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని కూడా కజియా మెజో షేర్ చేశారు.

కేరళకు చెందిన కజియా లిజ్ మెజో చిన్ననాటి నుంచి అబుదాబిలో పెరిగారు. ప్రస్తుతం లా విద్యను అభ్యసిస్తున్న ఆమె ఆగస్టు 2026లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నారు.ఈ ఏడాది జరగనున్న అంతర్జాతీయ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్‌కు ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు.

యూఏఈలో పెరిగినప్పటికీ భారత్‌తో తన అనుబంధాన్ని గర్వంగా వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు కజియా సిద్ధమవుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com