పిల్లల స్క్రీన్ టైమ్‌పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- August 09, 2026
దోహా: వేసవి సెలవుల్లో పిల్లలు మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లు, గేమింగ్ పరికరాలను అధికంగా వినియోగించడం వల్ల వారి నిద్ర, ఏకాగ్రత, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని సిద్రా మెడిసిన్ నిపుణులు హెచ్చరించారు. స్క్రీన్ ముందు ఎక్కువసేపు గడపడం వల్ల శారీరక వ్యాయామం, సృజనాత్మక ఆటలు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపే సమయం తగ్గిపోతుందని తెలిపారు.
సిద్రా మెడిసిన్‌లో పీడియాట్రిక్ మెడిసిన్ విభాగం చైర్ డాక్టర్ అహ్మద్ అల్ హమ్మాది మాట్లాడుతూ.. స్క్రీన్ వినియోగంతో వచ్చే సమస్యలను కేవలం పరికరాల ముందు గడిపే సమయంతోనే చూడకూడదన్నారు. పిల్లలు స్క్రీన్ కారణంగా కోల్పోతున్న ఇతర కార్యకలాపాలపైనా దృష్టి పెట్టాలని సూచించారు.
ఎక్కువసేపు మొబైల్, ట్యాబ్లెట్, కంప్యూటర్, గేమింగ్ పరికరాలను ఉపయోగించడం వల్ల కళ్ల అలసట, తలనొప్పి, మెడ నొప్పి, తప్పు భంగిమ వంటి సమస్యలు తలెత్తవచ్చన్నారు. అంతేకాకుండా శారీరక చురుకుదనం తగ్గి పిల్లలు సోమరితనానికి, సామాజిక సంబంధాలకు దూరమయ్యే అవకాశం ఉందని చెప్పారు.
రాత్రివేళల్లో మరింత ప్రమాదం
రాత్రివేళ స్క్రీన్ వినియోగం పిల్లల నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్ అల్ హమ్మాది తెలిపారు. స్క్రీన్ నుంచి వెలువడే కాంతి, ఇంటరాక్టివ్ కంటెంట్ కారణంగా నిద్రకు అవసరమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గవచ్చన్నారు. దీంతో మెదడు ఇంకా పగటిపూటే ఉన్నట్లు భావించే పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. నిద్ర సరిగా లేకపోతే పిల్లల్లో చిరాకు, ఏకాగ్రత లోపం, భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బందులు తలెత్తవచ్చన్నారు. దీర్ఘకాలంగా నిద్రకు భంగం కలిగితే జ్ఞాపకశక్తి, చదువుకునే సామర్థ్యం, భావోద్వేగ స్థైర్యంపైనా ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.
పిల్లల స్క్రీన్ వినియోగం హద్దులు దాటిందనడానికి కొన్ని సంకేతాలు ఉంటాయని నిపుణులు తెలిపారు. పరికరాన్ని తీసుకుంటే తీవ్రంగా అసహనం వ్యక్తం చేయడం, గతంలో ఇష్టపడిన ఆటలు, హాబీలపై ఆసక్తి తగ్గడం, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, ఎక్కువసేపు ఇంట్లోనే ఉండటం వంటివి వాటిలో ముఖ్యమైనవన్నారు. తలనొప్పి, కళ్లలో అలసట, మెడ పట్టేయడం వంటి శారీరక లక్షణాలు కనిపించినా స్క్రీన్ అలవాట్లను పునఃపరిశీలించాలని సూచించారు.
5 ‘సీ’లతో నియంత్రణ
పిల్లల స్క్రీన్ వినియోగాన్ని నియంత్రించేందుకు డాక్టర్ అల్ హమ్మాది 5 ‘సీ’ల విధానాన్ని సూచించారు.
చైల్డ్ (Child): ప్రతి పిల్లవాడిపై స్క్రీన్ ప్రభావం ఒకేలా ఉండదు. వారి వయసు, ఆసక్తులు, అవసరాలను బట్టి మీడియా వినియోగాన్ని పర్యవేక్షించాలి.
కంటెంట్ (Content): పిల్లలు చూస్తున్న కంటెంట్‌పై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి. వయసుకు తగిన, సానుకూల, సృజనాత్మక కంటెంట్‌ను ప్రోత్సహించాలి.
కామ్ (Calm): ఒత్తిడి తగ్గించుకునేందుకు స్క్రీన్‌పైనే ఆధారపడకుండా పుస్తకాలు చదవడం, కుటుంబంతో మాట్లాడటం, వ్యాయామం చేయడం వంటి ప్రత్యామ్నాయాలను అలవాటు చేయాలి.
క్రౌడింగ్ అవుట్ (Crowding Out): స్క్రీన్ సమయాన్ని తగ్గించడమే కాకుండా.. దాని వల్ల తగ్గిపోయిన బహిరంగ ఆటలు, కుటుంబంతో భోజనం, స్నేహితులతో గడిపే సమయాన్ని తిరిగి పెంచాలి.
కమ్యూనికేషన్ (Communication): పిల్లలతో స్క్రీన్ వినియోగంపై తల్లిదండ్రులు తరచూ మాట్లాడాలి. విమర్శించకుండా వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు.
ప్రత్యామ్నాయాలు చూపించాలి
పిల్లల నుంచి పరికరాలను బలవంతంగా లాక్కోవడం కంటే.. వారికి ఆసక్తికరమైన ప్రత్యామ్నాయాలను అందించడం మంచిదని డాక్టర్ అల్ హమ్మాది తెలిపారు. ఈత, సైక్లింగ్, డ్రాయింగ్, బేకింగ్, బహిరంగ ఆటలు వంటి కార్యక్రమాల్లో పిల్లలను పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. వేసవి క్యాంపులు, పార్కుల్లో ఆటలు, కుటుంబ సమావేశాలు పిల్లల్లో సామాజిక సంబంధాలను పెంపొందించడంతో పాటు భావోద్వేగ స్థైర్యాన్ని మెరుగుపరుస్తాయని చెప్పారు.
టెక్నాలజీని పూర్తిగా నిషేధించడం లక్ష్యం కాదని.. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన ఆట, వ్యాయామం, నిద్ర, కుటుంబం, స్నేహితులతో గడిపే సమయానికి ప్రాధాన్యం ఇవ్వడమే ముఖ్యమని డాక్టర్ అల్ హమ్మాది స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







