కువైట్‌లో 53 శాతం తగ్గిన నేరాలు సంఖ్య..!!
- August 10, 2026
కువైట్ : కువైట్‌లో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అన్ని రకాల హింసాత్మక నేరాలు గణనీయంగా తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే 53.2 శాతం తగ్గినట్లు న్యాయశాఖ మంత్రి నాసర్ అల్-సుమైత్ వెల్లడించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు వచ్చిన కేసుల ఆధారంగా ఈ గణాంకాలను వెల్లడించారు. 2025 తొలి ఆరు నెలల్లో 607 హింసాత్మక నేరాల కేసులు నమోదు కాగా.. 2026 తొలి ఆరు నెలల్లో ఆ సంఖ్య 284కి తగ్గింది. హత్య, హత్యాయత్నం కేసులు కూడా స్వల్పంగా తగ్గాయి. 2025 తొలి ఆరు నెలల్లో 26 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది అదే కాలంలో 24 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ విభాగంలో 7.7 శాతం తగ్గుదల నమోదైంది.
దాడులు, కొట్టడం వంటి కేసులు 63.6 శాతం తగ్గాయి. గత ఏడాది 376 కేసులు నమోదవగా.. ఈ ఏడాది 137 కేసులకు పడిపోయాయి. హత్య లేదా శారీరక హాని చేస్తామని బెదిరించిన కేసులు 43.4 శాతం తగ్గి 99 నుంచి 56కు చేరాయి. ఇక ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం కేసులు 44.3 శాతం తగ్గాయి. 2025లో 61 కేసులు నమోదవగా.. 2026లో 34 కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన శారీరక గాయాలకు దారితీసిన గొడవల కేసులు కూడా 62.5 శాతం తగ్గి 16 నుంచి 6కి పడిపోయాయి.
కఠినమైన చట్టపరమైన సంస్కరణలు
గత రెండేళ్లలో కువైట్ ప్రభుత్వం క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో పలు కీలక చట్టపరమైన సంస్కరణలు తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. వ్యభిచారం చేస్తూ పట్టుబడిన భార్య లేదా మహిళా బంధువును హత్య చేసిన పురుషుడికి శిక్ష తగ్గించే నిబంధనను శిక్షాస్మృతి నుంచి తొలగించారు. అలాగే పరువు పోతుందనే కారణంతో ప్రసవం అనంతరం వెంటనే తన నవజాత శిశువును హత్య చేసిన తల్లికి ఉపశమనం కల్పించే నిబంధనను కూడా రద్దు చేశారు.
అనుకోకుండా మరణం లేదా గాయానికి కారణమైన సందర్భాల్లో శిక్షలను కఠినతరం చేయడంతో పాటు.. సరైన కారణం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో కత్తులు, పదునైన ఆయుధాలను కలిగి ఉండటాన్ని నేరంగా ప్రకటించారు. వాటిని దాడులకు ఉపయోగించడం లేదా ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు వినియోగించడంపై కూడా కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు.
అదేవిధంగా గృహ హింస నుంచి రక్షణ కోసం కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. పిల్లలు తమ తల్లిదండ్రులపై దాడి చేసే కేసులు, పిల్లలపై నేరాలు, అసహాయ వ్యక్తులపై జరిగే నేరాల్లో రాజీ లేదా కేసు ఉపసంహరణకు అవకాశం లేకుండా నిబంధనలు రూపొందించినట్లు న్యాయశాఖ మంత్రి నాసర్ అల్-సుమైత్ తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







