ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..

- August 12, 2026 , by Maagulf
ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..

మస్కట్: ఒమన్ సముద్ర తీరాల్లో చమురు కాలుష్యం ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. ‘క్యారొలిన్ బెజెంగి’ (Caroline Bezengi) అనే చమురు ట్యాంకర్ ప్రమాదానికి గురైన నేపథ్యంలో రాస్ మద్రకా ప్రాంతంలోని కొన్ని బీచ్‌లకు చమురు వ్యాపించినట్లు ఒమన్ పర్యావరణ సంస్థ బుధవారం వెల్లడించింది.

ప్రస్తుతం పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చమురు మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాస్ మద్రకా తీర ప్రాంతంలో చమురు పొర సుమారు 40 కిలోమీటర్ల మేర విస్తరించే అవకాశం ఉందని, రానున్న గంటల్లో మసీరా ద్వీపం దక్షిణ తీరాల వైపు కూడా 10 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో వ్యాపించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు, బీచ్‌లకు వచ్చే పర్యాటకులు, సాధారణ ప్రజలు తీర ప్రాంతాల్లో కనిపించే చమురు లేదా ఇతర కాలుష్య పదార్థాల వద్దకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. అలాంటి పదార్థాలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ప్రజలు అధికారిక వర్గాలు విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకోవాలని, ధృవీకరణ లేని గణాంకాలు, మ్యాప్‌లు లేదా అంచనాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని పర్యావరణ సంస్థ స్పష్టం చేసింది.

హల్లానియాత్ దీవుల వద్ద ట్యాంకర్ ప్రమాదం

ఆగస్టు 6న ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ.. ధోఫార్ ప్రాంతంలోని అల్ హల్లానియాత్ దీవుల సమూహంలో భాగమైన అల్-ఖిబ్లియ్యా ద్వీపం సమీపంలో చమురు ట్యాంకర్ మునిగిపోయినట్లు వెల్లడించింది. ఈ ఘటనతో సముద్ర జీవవైవిధ్యం, సహజ పర్యావరణ వ్యవస్థకు ముప్పు ఏర్పడే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

తొలుత చమురు పొర హల్లానియాత్ దీవులకు ఈశాన్య దిశగా విస్తరించి, ఒమన్ ప్రధాన భూభాగ తీరాల వైపు కదిలింది. దాని వ్యాప్తి సుమారు 449 కిలోమీటర్ల వరకు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం ఉపగ్రహ చిత్రాలు, వైమానిక నిఘా, సముద్ర సర్వేలు, సాంకేతిక పర్యవేక్షణ పద్ధతులు, న్యూమరికల్ మోడళ్లను ఉపయోగించి చమురు పొర కదలికను అధికారులు అంచనా వేస్తున్నారు. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

ట్యాంకర్ నుంచి చమురు లీకేజీ నియంత్రణకు చర్యలు

చమురు కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ప్రమాదానికి గురైన నౌకలో లీకేజీకి కారణాలను గుర్తించడం, నౌక నిర్మాణాన్ని సురక్షితంగా ఉంచడం వంటి చర్యలు కొనసాగుతున్నాయి.

కెమెరూన్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ సుమారు 274.48 మీటర్ల పొడవు, 48 మీటర్ల వెడల్పు కలిగి ఉన్నట్లు సమాచారం. మంత్రిత్వ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థలకు చెందిన సాంకేతిక బృందాలు, నిపుణులు ఘటనాస్థలిలో పనిచేస్తున్నారు.

నౌకలోని చమురు నిల్వలను సురక్షితంగా మరో ప్రాంతానికి తరలించడం, అనంతరం నౌకను వెలికితీయడం లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం వైమానిక నిఘా, సముద్రంలో డైవింగ్ కార్యకలాపాలు, నిరంతర ఫీల్డ్ మానిటరింగ్ వంటి చర్యలు కొనసాగుతున్నాయి.

అరుదైన సముద్ర జీవవైవిధ్యానికి నిలయం హల్లానియాత్ దీవులు

ఒమన్ ఆగ్నేయ తీరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో అల్ హల్లానియాత్ దీవులు ఉన్నాయి. ఐదు దీవులతో కూడిన ఈ ప్రాంతం సముద్ర జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. వాటిలో అల్ హల్లానియా అతిపెద్ద, జనావాసం ఉన్న దీవిగా గుర్తింపు పొందింది.

ఈ దీవులలో సముద్ర తాబేళ్ల గుడ్లు పెట్టే తీరాలు, పగడపు దిబ్బలు, వివిధ రకాల చేపలు, పక్షులు వంటి అరుదైన జీవజాలం ఉంది. డాల్ఫిన్లు, తిమింగలాలు కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తుంటాయి.

ఒమన్‌తో పాటు అరేబియా సముద్ర ప్రాంతంలో మాస్క్డ్ బూబీ పక్షులకు గూడు కట్టుకునే ముఖ్యమైన ప్రాంతంగా కూడా హల్లానియాత్ దీవులు గుర్తింపు పొందాయి. సోకోత్రా కార్మొరెంట్, సూయిటీ గల్, బ్రైడిల్డ్ టెర్న్ వంటి పక్షి జాతులు కూడా ఇక్కడ కనిపిస్తాయి.

పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, పరిణామాలను బట్టి ప్రజలకు అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామని ఒమన్ పర్యావరణ సంస్థ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com