దర్శకుడు శివ నిర్వాణతో మాగల్ఫ్ ముఖాముఖీ

- August 18, 2026 , by Maagulf
దర్శకుడు శివ నిర్వాణతో మాగల్ఫ్ ముఖాముఖీ

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది.ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

రామ్ చరణ్ ఈ సినిమాలో కనిపిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నిజంగా ఆయన కనిపిస్తారా?
-లేదండి.అది సోషల్ మీడియా ప్రచారం మాత్రమే.రామ్ చరణ్ అయ్యప్ప భక్తులు. ఆయనకు ఆ వైబ్ వుంటుంది. బహుశా అభిమానులు అలా కోరుకున్నారేమో.కానీ ఇందులో చరణ్ గారు కనిపిస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఈ సినిమా రామ్ చరణ్ కి నచ్చాలని కోరుకుంటున్నా.

'ఇరుముడి' టైటిల్ ప్రకటించినప్పటి నుంచి చాలా అంచనాలు ఉన్నాయి. తర్వాత వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆ అంచనాలను ఇంకా పెంచింది. మరి ఇన్ని భారీ అంచనాలను సినిమా అందుకుంటుందా?

-ఈ సినిమాలో మొత్తం మూడు లేయర్స్ ఉంటాయి. ఒకటి అయ్యప్ప స్వామి మాల నేపథ్యం, అలాగే ఫ్యామిలీ, మరొకటి క్రైమ్ యాంగిల్. ప్రమోషన్స్ కూడా ఆ కంటెంట్‌కు తగ్గట్టే ప్లాన్ చేసుకున్నాను. ఆ ప్లాన్ ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని రివీల్ చేసుకుంటూ వచ్చాము. ట్రైలర్ దగ్గరికి వచ్చేసరికి సినిమాలో ఏముందనేది ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది. ప్రతి ఒక్కరూ సినిమాలో ఏముందో చూడడానికి ప్రిపేర్‌గా ఉన్నారు. ఆ అంచనాలను సినిమా ఖచ్చితంగా అందుకుంటుంది.

రవితేజని చాలా కొత్తగా చూపించారు. ఆయనను అలా చూపించడానికి మీరు చేసిన ప్రిపరేషన్ ఏమిటి?
-ఎప్పుడైనా ఎవరూ టచ్ చేయని పాయింట్ చెప్తున్నప్పుడు ఒక యాక్టర్ చేస్తే ఒకలా ఉంటుంది. అదే స్టార్ చేస్తే దాని రీచ్ మరోలా ఉంటుంది. అయ్యప్ప స్వామిమాల నేపథ్యం, అందులో ఫ్యామిలీ, అలాగే కొత్త సెటప్.ఇలాంటి కథని రవితేజ లాంటి స్టార్ హీరోతో చేసినప్పుడు ఆ కథ ప్రతి ఇంటికి చేరుతుంది.

ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత మలయాళ మాలికాపురం తో పోలిక వచ్చింది కదా? ఎలా అనిపించింది మీకు?
-అయ్యప్ప స్వామి బ్యాక్‌గ్రౌండ్‌లో, ముఖ్యంగా సౌత్‌లో చాలా తక్కువ సినిమాలు వస్తున్నాయి. గతంలో ఎప్పుడో ఒకసారి 'అయ్యప్ప స్వామి మహత్యం' అనే సినిమా వచ్చింది. ఒక రవితేజ గారి లాంటి స్టార్ హీరోతో ఇలాంటి సినిమాని మనం అప్పటివరకు చూడలేదు. ఇలాంటి అంశాలను టచ్ చేసినప్పుడు చాలా తక్కువ సినిమాలు ఉంటాయి కాబట్టి, అప్పటివరకు వచ్చిన ఏదో ఒక సినిమాతో పోలిక అయితే ఉంటుంది.

అలాగే 'మాలికాపురం' తో పోలిక వచ్చింది. అయితే నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే నా సినిమా కంటెంట్ ఏంటో నాకు తెలుసు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా కంటెంట్ ఏంటో అందరికీ తెలిసింది. ఇది చాలా యూనిక్ ఫిల్మ్ అని ప్రేక్షకులే చెప్తున్నారు. ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటివరకు సినిమా రాలేదు.

అయ్యప్ప స్వామి మాల నేపథ్యంలో కథ ఉంటుంది కదా? దీని గురించి మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు?
-నేను ఈ కథ అనుకున్న తర్వాత అయ్యప్ప స్వామి మాల గురించి చాలామందిని అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నాను.  అయితే ఎంతమందిని, ఎన్ని విషయాలు అడిగినా సరే ఏదో ఒక అసంతృప్తి ఉండేది. నేను ఈ సినిమా కోసం మాల కూడా వేశాను. ఫిలింనగర్ పడిపూజలకు వెళ్లాను. గురుస్వాములను కలిశాను. అంతకుముందు దర్శకుడు హను రాఘవపూడి తో శబరిమల కూడా వెళ్లాను. ఇందులో మంగళహారతులు, భజనలు, రుద్రాక్షలు వేసుకునే విధానం...అన్నీ చాలా ప్రామాణికంగా ఉంటాయి.

ఈ కథ అనుకున్నప్పుడే రవితేజని అనుకున్నారా?
-ఈ కథ అనుకున్నప్పుడు ఎవరినీ మనసులో అనుకోలేదు. కాకపోతే ఇది రవితేజ గారికి చెప్పిన తర్వాత ఈ పాత్రకి పర్ఫెక్ట్‌గా సరిపోతారు అనిపించింది. ఆయన గడ్డం, ఆయన తేజస్సు ఈ పాత్రకి అద్భుతంగా సరిపోయాయి.

-రవితేజ చాలా కూల్‌గా ఉంటారు. కథ చెప్పి ఓకే చేసిన తర్వాత దర్శకుడికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేస్తారు. ఎవరిపైనా ఒత్తిడి పెట్టరు. ఆయన ఒత్తిడి తీసుకోరు.

'మల్లెపూల పల్లకి' పాట గురించి?
-'మల్లెపూల పల్లకి' పాటకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన రెండు రోజుల్లోనే 9 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసింది.ఇది అయ్యప్ప స్వామి మాల నేపథ్యంలో జరిగే కథ కాబట్టి ఇందులో భజనలు, పాటలు ఉంటాయి. సీలేరు ప్రాంతంలో అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువగా పాడుకునే పాట ఏదని ఒక స్వామిని అడిగాను. ఆయన 'మల్లెపూల పల్లకి' పాట గురించి చెప్పారు. ఆ పాటతో షూటింగ్ చేశాము. ఆ తర్వాత చాలామంది ఈ పాట గురించి రిక్వెస్ట్ చేశారు. మేము అనుకున్నది, అభిమానులు కోరుకుంటుంది ఒకటే అని హ్యాపీగా అనిపించింది.

-15 సంవత్సరాలుగా ఇది పడిపూజల్లో ప్రతి అయ్యప్ప భక్తులు పాడుకునే పాట. అందుకే ఈ పాట విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకున్నాం.ఇప్పటి వరకు మనం ఎవరి గొంతుతో అయితే వింటున్నామో, ఆయనతోనే ఈ పాట పాడిస్తే బాగుంటుందని టీమంతా భావించాం. జీవీ ప్రకాష్ గారు కావాలనుకుంటే దేశంలో ఏ సింగర్ అయినా వచ్చి పాడుతారు. కాకపోతే మేము అభిమానులు ఆ పాటని ఇంతకాలం ఇష్టపడుతున్న వారి మనోభావాలను గౌరవిస్తూ, ఒరిజినల్‌గా పాట పాడిన డప్పు శ్రీను గారితోనే పాడించడం జరిగింది. వారందరినీ మా స్టూడియోకి తగిన విధంగా గౌరవించి పాటను రికార్డ్ చేశాము.

-డప్పు శ్రీను 15 సంవత్సరాల క్రితం ఈ పాట పాడారు. ఇప్పుడు ఆయన వయసు 60 సంవత్సరాలు. అప్పటికి, ఇప్పటికీ ఎనర్జీలో కొంత మార్పు రావడం సహజం.ఈ పాట థియేటర్ లో ఒక పూనకంతో చూస్తారు. డప్పు శ్రీను గొంతుతోనే ఈ పాట చిరస్థాయిగా ఉంటుంది.

డీఓపీ విష్ణు శర్మ గురించి?
-తను అద్భుతమైన కెమెరామెన్. రవితేజ, నేను ఇద్దరం ఫాస్ట్‌గా పని చేస్తాం. ఆ ఫాస్ట్‌కి తగ్గ కెమెరామెన్ కావాలనుకున్నప్పుడు విష్ణు శర్మ దానికి తగ్గ వేగంతో పని చేశాడు. చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. సీలేరులో తీసిన విజువల్స్ ప్రేక్షకుల్ని కథలోకి తీసుకువెళ్లిపోతాయి.

బేబీ నక్షత్ర గురించి?
-ఈ పాత్రకి చాలా నేటివిటీ కావాలి.మన ఇంట్లో పాపలాగా ఉండాలి. అలాంటి పాప కోసం వెతుకుతున్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తన రీల్స్ కనిపించాయి. 'మనెమ్మ' క్యారెక్టర్‌కి ఒక మట్టి వాసన కావాలి.మేము లుక్ టెస్ట్ చేసి చూశాం.తనతో రెండు వీడియోలు షూట్ చేశాం. 'మనెమ్మ' క్యారెక్టర్‌కి నక్షత్ర పర్ఫెక్ట్‌గా సరిపోతుందని అనిపించింది.

'నిన్ను కోరి', 'మజిలీ', 'ఖుషి' మీ శైలిలో ఉండే చిత్రాలు. 'ఇరుముడి' చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇలాంటి కథ తీసుకోవడానికి కారణం?
-ప్రతి కథని తీవ్రంగా చెప్పాలనేదే నా ఉద్దేశం. 'నిన్ను కోరి', 'మజిలీ' ఈ చిత్రాలన్నీ కూడా మళ్లీ మళ్లీ చెప్పుకునేలాగా ఉంటాయి. గుర్తుండిపోతాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయినప్పుడు కూడా నా కథలు గుర్తుండిపోవాలి అనేది నా ఉద్దేశం. అలాంటి ఇంటెన్సిటీ ప్రేమ కథలో కొంతవరకు దొరుకుతుంది. 'ఇరుముడి'లో కూడా ఒక క్రైమ్ యాంగిల్‌లో ఒక అద్భుతమైన కథ దొరికింది.

-అయ్యప్ప స్వామి మాలలో అద్భుతమైన హ్యూమన్ డ్రామా ఉంది.ఆ మాల వేసుకున్న తర్వాత ఎవరైనా సరే చాలా నిష్టగా, భయభక్తులతో ఉంటారు.తప్పు చేయడానికి భయపడతారు. ప్రతిరోజూ తప్పులు చేసేవారు కూడా ఆ మాల దీక్షలో ఉన్నంతకాలం ఒక్క తప్పు కూడా చేయకూడదని దీక్షగా ఉంటారు.

-ఇందులో రవితేజ పాత్ర రూపంలో అలాంటి ఒక హ్యూమన్ డ్రామా అద్భుతంగా కుదిరింది. అది మీరు థియేటర్స్‌లో ఆస్వాదించబోతున్నారు. ఈ స్క్రీన్‌ప్లే గురించి చెప్పాలంటే... అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు హీరో ఎలా ఉంటారు, మాలలో లేనప్పుడు ఎలా ఉంటారు అనేది చాలా అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో కథ ముందుకు వెళ్తుంది.

-ఇది మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. అయ్యప్ప స్వామి మాల బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ఇది అయ్యప్ప స్వామి మాల బ్యాక్‌డ్రాప్‌లో ఉండే కథే కానీ, అయ్యప్ప స్వామి కథ కాదు.

సాయికుమార్ క్యారెక్టర్ గురించి?
-గురుస్వామి క్యారెక్టర్‌లో సాయికుమార్ చాలా అద్భుతంగా చేశారు. ఆయన ఆహార్యం ఆ పాత్రకు సరిగ్గా సరిపోయింది.

మాంటేజ్ సాంగ్స్ మీరే డైరెక్ట్ చేశారని విన్నాం?
-నా మొదటి సినిమా నుంచి అది నాకు అలవాటు. నేను షూటింగ్ చేస్తున్నప్పుడే కొన్ని మాంటేజ్‌లు తీసుకొని పెట్టుకుంటాను. అవన్నీ నేను ఎడిటింగ్‌లో యూజ్ చేస్తుంటాను. దానివల్ల ఆ ప్రాంతం, ఆ ఊరు మొత్తం ఆ కథలో తిరుగుతున్నట్టుగా ఉంటుంది. 'నిన్ను కోరి' సినిమా నుంచి నాకు అది అలవాటు.

మైత్రి మూవీ మేకర్స్ గురించి?
-నవీన్, రవి దర్శకుడికి చాలా ఫ్రీడమ్ ఇస్తారు. నేను త్వరగా తీస్తాను. అలాగే బడ్జెట్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తానని వారికి నమ్మకం. సీలేరులో 250 మందితో కలిసి షూటింగ్ చేశాం. అది మామూలు విషయం కాదు. వారు చాలా సపోర్ట్ చేశారు.  

ముందే 'ఇరుముడి' టైటిల్ అనుకున్నారా?
అవునండి. ఇందులో తండ్రికి, కూతురికి...అలాగే అయ్యప్ప భక్తుడికి, మాలకు... అలాగే ఒక క్రైమ్ ఎలిమెంట్ కి ముడి ఉంది. ఈ మూడు ముళ్లను కలిపి 'ఇరుముడి' అని అనుకున్నాను.

లొకేషన్స్ గురించి?
-అన్ని రూరల్ లొకేషన్స్‌లో చేశాం.మనం సాధారణంగా ఎక్కువగా కేరళ పల్లెల్లో షూట్ చేసి ఆంధ్రాకి మ్యాచ్ చేస్తుంటాం.సుకుమార్ 'రంగస్థలం' సినిమాకి మారేడుమిల్లి వరకు వెళ్లారు. ఇప్పుడు అక్కడ మరింత టూరిజం పెరిగింది.

-ఈ సినిమా కోసం మేము మారేడుమిల్లి దాటి మరో రెండు గంటలు ప్రయాణం చేసి సీలేరు ప్రాంతానికి వెళ్లాం.అది ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్.ఎటు చూసినా కొండలు, అడవులు, పచ్చదనం ఉంటుంది. మాకు ఎంతగానో సహకరించిన సీలేరు బాలాజీ, కొల్లూరు రమణమూర్తి, అలాగే అక్కడి ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com