మనిషిని మనిషిగా ...

- March 24, 2015 , by Maagulf

‘మనిషిని మనిషిగా చూడటం ‘

అయింది నేడు కవితా లేఖనానికి అంశం...

తోటి మనిషి సంగతి వదిలేసి

మనలోకి మనం ఒకసారి తొంగి చూసుకుందాం!!

నా రక్తానికి అందరిలాగే ఎరుపురంగు ఉన్నా

వయసును బట్టి ఒక పేరు

యువరక్తం ఉడుకురక్తం చల్లారినరక్తం అన్నిశక్తులు ఉడిగినరక్తం

మతాన్నిబట్టి మరో పేరు

హిందూరక్తం ముస్లిం రక్తం

శిలువ నుండి జారిన జీసస్ రక్తం

నా బ్యాంకు బాలన్సు

సమాజం లో స్థానాన్ని నిర్ధారిస్తుంది

పదవి నాకు లంచం పట్టే అధికారం ఇస్తుంది

రాజకీయం నాకు గూండాగిరీకి దాదాగిరీకి లైసెన్సు ఇస్తుంది

పదేళ్ళ ప్రాయపు పసి బాలిక నుండి

యాభైఏళ్ళ ప్రౌఢ వరకూ

అందరూ నాకు శృంగార సాధనాలే

వావి వరసలూ సమాజపు హద్దులూ

నాకసలు గుర్తుండవు

అత్యాచారానికి అఘాయిత్యానికి

 నేనెప్పుడు ముందుంటాను

అసలు జంకను క్షణమయినా సిగ్గుపడను

పైపెచ్చు అలా చేస్తేనే

మగతనం అనుకుంటాను

నా తల్లీ ఒక స్త్రీ అనీ

నా చెల్లీ ఒక మగువ అనీ

నాకసలు స్పృహ ఉండదు

పసువుకున్న స్వేఛ్చ

నాకెందుకు ఉండదని

బల్ల గుద్ది ప్రస్నిస్తాను

డబ్బు కోసం ఏ గడ్డైనా తింటాను

పొటీకెవరైన వస్తే

తలతీయించేందుకు వెనకాడను

జండా ఏదయితే నాకేంటి?

నా పబ్బం గడుపుకోవటమే నా ఎజెండా!!

నా తోటి వాళ్ళతో మనఘలేనేమో!

నాకయితే తెలీదుగాక తెలీదు

నేను మాత్రం ఒక విశిష్టమైన మనిషిని!

మనిషంటే నేనే!

మిగతావాళ్ళు మట్టిబొమ్మలు

పూలరెమ్మలు

చిదిమేస్తా..నలిపేస్తా!

నేనింతే! నా ఆలోచనింతే!

నా చైతన్య పరిధి ఇంతే!

చేతనయితే నన్ను ఏమార్చండి!

నా వంకరటింకర త్రోవను మార్చండి!

నీతి నిజాయితీలకు అందం విజయమని

నన్ను నమ్మించేందుకు ప్రయత్నించండి!

నేను నిజంగా ఇలా సుఖంగా లేను

మీతో కలుపుకొని నిజమైన సుఖమంటే ఏమిటో

నిర్వచనం ఇవ్వండి!

నేను చాలామంది నాలాంటి వాళ్ళకు

ప్రతీకను..అంతఃరూపాన్ని

నాతో మీ యజ్ఞం మొదలయితే

ప్రతి మనిషీ మరో మనిషిని

మనిషిగా చూడటం నేర్చుకుంటాడు

 

-డా||మాదిరాజు రామలింగేశ్వర రావు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com