దుబాయ్‌లో డెలివరీ రైడర్లకు ఉచిత భోజనం..ఆర్టీఏ కీలక కార్యక్రమం
- August 20, 2026
దుబాయ్: ఎండాకాలంలో డెలివరీ రైడర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో బస్, మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక విశ్రాంతి కేంద్రాల్లో డెలివరీ రైడర్లకు ఉచితంగా భోజనం పంపిణీ చేసింది.
యూఏఈ ఫుడ్ బ్యాంక్, డెలివరూ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దుబాయ్‌లో రోజువారీగా సేవలందిస్తూ, డెలివరీ రంగం మరియు విస్తృత ఆర్థిక వ్యవస్థకు కీలకంగా పనిచేస్తున్న రైడర్ల సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
RTA లైసెన్సింగ్ ఏజెన్సీ సీఈఓ అహ్మద్ మహ్బూబ్ మాట్లాడుతూ, వేసవిలో డెలివరీ రైడర్ల భద్రత, ఆరోగ్యం, సంక్షేమాన్ని కాపాడేందుకు జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలకు ఈ కార్యక్రమం మద్దతు ఇస్తుందని తెలిపారు.
అలాగే మిడ్డే బ్రేక్ కార్యక్రమానికి కూడా ఇది అనుగుణంగా ఉందన్నారు. మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 3 గంటల వరకు నేరుగా ఎండలో బహిరంగ ప్రదేశాల్లో పని చేయడంపై నిషేధం అమల్లో ఉంటుంది.
23 ప్రాంతాల్లో తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు
డెలివరీ రైడర్లకు అత్యవసర విశ్రాంతి, ఉపశమన సదుపాయాలు కల్పించేందుకు దుబాయ్‌లోని 23 బస్, మెట్రో స్టేషన్ ప్రాంతాలను తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రతిరోజూ భోజనం పంపిణీ చేశారు.
గోల్డ్ సూక్, అల్ సత్వా, అల్ జాఫిలియా, అల్ ఖుసైస్, అల్ కరామా బస్ స్టేషన్లతో పాటు రషీదియా, అల్ ఫుర్జాన్, డీఎంసీసీ, బుర్జుమాన్, ఇబ్న్ బత్తూతా, ఈ& మెట్రో స్టేషన్లను కూడా ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేశారు.
ఎక్కువ సంఖ్యలో డెలివరీ రైడర్లు వినియోగించే ప్రాంతాలను ప్రాధాన్యంగా తీసుకుని ఈ తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు RTA తెలిపింది.
మానవతా విలువలకు ప్రతీక
యూఏఈ ఫుడ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ టీమ్ హెడ్ మనాల్ ఒబైద్ బిన్ యారూఫ్ మాట్లాడుతూ, డెలివరీ కార్మికులు దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థలో కీలక భాగమని పేర్కొన్నారు.
ఆహారాన్ని సంరక్షించడం, వృథాను తగ్గించడం, దానధర్మాలు మరియు సామాజిక బాధ్యత భావనను బలోపేతం చేయడం వంటి లక్ష్యాలను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని ఆమె తెలిపారు.
సమాజంలో మానవతా విలువలను ప్రతిబింబించే ప్రతి కార్యక్రమానికి యూఏఈ ఫుడ్ బ్యాంక్ మద్దతు కొనసాగిస్తుందని బిన్ యారూఫ్ పేర్కొన్నారు. డెలివరీ రైడర్లకు ఉచిత భోజనం అందించడం ద్వారా వారి సేవలను గుర్తించడంతో పాటు, వేసవి తీవ్రత నుంచి వారికి కొంత ఉపశమనం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ రమ్లీ అగ్నిప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం..!!
- ఖతార్‌లో భారీగా పెరిగిన డిజిటల్ పేమెంట్స్..!!
- యూఏఈలో స్కూళ్లు రీ ఓపెన్.. పేరెంట్స్ పై పెరగనున్న ఖర్చుల భారం..!!
- రియాద్ విమానాశ్రయంలో ‘సైలెంట్ ఎయిర్పోర్ట్’ ప్రాజెక్ట్ ప్రారంభం..!!
- కువైట్‌లో కల్తీ ఆహారంపై అధికారుల కొరడా..!!
- ఇద్దరు పౌరులను ఆస్పత్రికి తరలించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- దుబాయ్‌లో డెలివరీ రైడర్లకు ఉచిత భోజనం..ఆర్టీఏ కీలక కార్యక్రమం
- జైవాన్ పేమెంట్స్ స్వీకరించిన తొలి ఎయిర్‌లైన్‌గా ఎతిహాద్ ఎయిర్వేస్
- చీనాబ్ బ్రిడ్జి పై తొలిసారి 100 కిమీ వేగంతో వందే భారత్
- రూపారెడ్డి హత్య కేసులో నిందితుల విలాసవంతమైన జీవనశైలి







