బహ్రెయిన్‌లో భారీగా తగ్గిన ల్యాండ్‌లైన్‌ కనెక్షన్లు..!!

- August 21, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో భారీగా తగ్గిన ల్యాండ్‌లైన్‌ కనెక్షన్లు..!!

మనామా: బహ్రెయిన్‌లో మొబైల్‌ ఫోన్‌ వినియోగం భారీగా పెరుగుతుండగా.. సంప్రదాయ ల్యాండ్‌లైన్‌ కనెక్షన్లు క్రమంగా తగ్గుతున్నాయి. 2025 చివరి నాటికి దేశంలో మొబైల్‌ లైన్ల సంఖ్య 2,316,986కు చేరింది. 2020లో ఉన్న 1,770,966తో పోలిస్తే ఐదేళ్లలో మొబైల్‌ కనెక్షన్లు 30.8 శాతం పెరిగాయి. అంటే అదనంగా 546,020 లైన్లు నమోదయ్యాయి. మరోవైపు ల్యాండ్‌లైన్‌ కనెక్షన్లు పదేళ్లలో 14.2 శాతం తగ్గాయి. 2015లో 243,835గా ఉన్న గృహ, వాణిజ్య ల్యాండ్‌లైన్లు 2025 నాటికి 209,282కు పడిపోయాయి.

ల్యాండ్‌లైన్‌ కనెక్షన్ల తగ్గుదలకు ప్రధానంగా వ్యాపార సంస్థలే కారణంగా నిలిచాయి. 2015లో 90,814గా ఉన్న వాణిజ్య ల్యాండ్‌లైన్లు 2025 నాటికి 62,081కు తగ్గాయి. అంటే ఏకంగా 31.6 శాతం తగ్గుదల నమోదైంది. ఇక ఇళ్లలో ల్యాండ్‌లైన్‌ కనెక్షన్ల సంఖ్య మాత్రం పెద్దగా పడిపోలేదు. 2015లో 153,021గా ఉన్న గృహ లైన్లు 2025లో 147,201కు చేరాయి. మొత్తంగా 3.8 శాతం మాత్రమే తగ్గాయి. దీంతో 2025లో బహ్రెయిన్‌లో మిగిలిన ల్యాండ్‌లైన్‌ కనెక్షన్లలో 70.3 శాతం గృహ వినియోగానివే ఉన్నాయి. 2015లో ఈ వాటా 62.8 శాతంగా ఉండేది.

ఇంటర్నెట్‌ కాల్స్‌తో మారుతున్న పరిస్థితి

ఇంటర్నెట్‌ ఆధారిత కాల్స్‌, క్లౌడ్‌ ఫోన్‌ సేవలు, వీడియో సమావేశాలు, మెసేజింగ్‌ యాప్‌ల వినియోగం పెరగడంతో వ్యాపార సంస్థలు పాత తరహా మల్టీ-లైన్‌ ఫోన్‌ వ్యవస్థలకు దూరమవుతున్నాయి. 2025లో మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ కలిపి మొత్తం 2,526,268 కనెక్షన్లు నమోదయ్యాయి. వీటిలో మొబైల్‌ కనెక్షన్ల వాటా 91.7 శాతం కాగా.. ఫిక్స్‌డ్‌ లైన్ల వాటా కేవలం 8.3 శాతమే. అంటే బహ్రెయిన్‌లో ప్రతి ఒక ల్యాండ్‌లైన్‌కు సుమారు 11 మొబైల్‌ లైన్లు ఉన్నాయి. మొబైల్‌ కనెక్షన్లు 2016లో ఏకంగా 2,994,865కు చేరాయి. అయితే ఆ తర్వాత వరుసగా నాలుగేళ్లు తగ్గి 2020లో 1,770,966కు పడిపోయాయి. 2016తో పోలిస్తే ఇది 40.9 శాతం తగ్గుదల నమోదైంది. 2016లో అపరిమిత డేటా ఆఫర్లు అందుబాటులో ఉండటం వల్ల మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్లు భారీగా పెరిగాయని బహ్రెయిన్‌ టెలికమ్యూనికేషన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ (TRA) నివేదిక పేర్కొంది. ఆ ఆఫర్లు తొలగించిన తర్వాత కనెక్షన్లు తగ్గాయి. ఒకటి కంటే ఎక్కువ సిమ్‌లు ఉపయోగించే వారి సంఖ్య కూడా తగ్గింది. అయితే 2020 తర్వాత మొబైల్‌ మార్కెట్‌ మళ్లీ పుంజుకుంది. 2021లో 8.6 శాతం, 2022లో 10.7 శాతం, 2023లో 5.7 శాతం, 2024లో 2.9 శాతం వృద్ధి నమోదైంది. 2025లో మాత్రం కేవలం 876 కొత్త లైన్లు మాత్రమే చేరాయి.

భారీగా పెరిగిన డేటా వినియోగం

బహ్రెయిన్‌లో ఇంటర్నెట్‌ ఆధారిత కమ్యూనికేషన్‌ పెరుగుతున్న విషయాన్ని డేటా వినియోగం కూడా స్పష్టం చేస్తోంది. 2019లో 692 మిలియన్‌ గిగాబైట్లుగా ఉన్న బ్రాడ్‌బ్యాండ్‌ డేటా ట్రాఫిక్‌ 2024లో 1.971 బిలియన్‌ గిగాబైట్లకు చేరింది. అంటే సుమారు 185 శాతం పెరిగింది. 2024లో మొబైల్‌ డేటా వినియోగం మరో 15 శాతం పెరగగా, మొబైల్‌ వాయిస్‌ కాల్స్‌ ట్రాఫిక్‌ 7 శాతం తగ్గింది. అదే సమయంలో ల్యాండ్‌లైన్‌ నుంచి చేసిన ఔట్‌గోయింగ్‌ కాల్స్‌ 2023లో 11.5 కోట్ల నిమిషాల నుంచి 2024లో 10 కోట్ల నిమిషాలకు తగ్గాయి. ఇంటర్నెట్‌ కాల్స్‌, మెసేజింగ్‌ యాప్‌ల వినియోగం పెరగడమే సంప్రదాయ ల్యాండ్‌లైన్‌ సేవల తగ్గుదలకు ప్రధాన కారణమని TRA పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com