థాయ్‌లాండ్‌లో వెలుగుచూసిన ‘రాక్షస కన్ను’.. పోటెత్తిన పర్యాటకులు

- August 21, 2026 , by Maagulf
థాయ్‌లాండ్‌లో వెలుగుచూసిన ‘రాక్షస కన్ను’.. పోటెత్తిన పర్యాటకులు

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లోని ఫు లాంగ్కా నేషనల్ పార్క్‌లో ఉన్న ప్రసిద్ధ నాకా కేవ్ వద్ద అరుదైన ప్రకృతి దృశ్యం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. గుహలోని రాతిపై ‘రాక్షస కన్ను’ను తలపించే ఆకృతి కనిపించడంతో ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.

శతాబ్దాలుగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాతి గుంటలో వర్షపు నీరు చేరుతుంది.నిర్దిష్ట సమయంలో సూర్యరశ్మి సరైన కోణంలో ఆ నీటిపై పడటంతో కాంతి పరావర్తనం చెంది, రాతిపై కన్ను ఆకారంలో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

ఈ ప్రత్యేక ఆకృతి మే నుంచి అక్టోబర్ వరకు వర్షాకాలంలో కనిపించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు, సూర్యకాంతి కోణం ఆధారంగా దీని రూపం, స్పష్టత మారవచ్చని పేర్కొన్నారు.

‘రాక్షస కన్ను’ ఆకృతి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాకా కేవ్‌కు పర్యాటకుల రద్దీ పెరిగింది. అయితే ఈ సహజ రాతి నిర్మాణాన్ని ఎవరూ తాకకూడదని, దాని సహజ రూపానికి ఎలాంటి నష్టం కలిగించకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు పర్యాటకులను హెచ్చరించారు.

ప్రకృతి అద్భుతంగా మారిన ఈ అరుదైన దృశ్యం ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com