మానవత్వానికి ప్రతీకగా ఖతార్ ప్రవాస తెలుగు సమాజం..

- August 22, 2026 , by Maagulf
మానవత్వానికి ప్రతీకగా ఖతార్ ప్రవాస తెలుగు సమాజం..

దోహా: కష్టకాలంలో ఉన్న ఓ తెలుగు కుటుంబానికి అండగా నిలిచి ఖతార్ ప్రవాస తెలుగు సమాజం మానవత్వానికి నిజమైన ప్రతిరూపంగా నిలిచింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన స్వర్గీయ సుంకై మల్లేశ్ ఇటీవల ఖతార్‌లో మృతి చెందడంతో తీవ్ర విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి ప్రవాస తెలుగు సంఘాలు, నాయకులు, శ్రేయోభిలాషులు కలిసి 42,966 ఖతార్ రియాల్స్ (సుమారు రూ.11.19 లక్షలు) ఆర్థిక సహాయం అందించారు.

మల్లేశ్ కుటుంబ పెద్దను కోల్పోవడంతో తీవ్ర విషాదంలో ఉండగా, ఆయన కుమార్తె వివాహం కూడా సమీపిస్తుండటంతో కుటుంబంపై ఆర్థిక భారం మరింత పెరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్ర కళా వేదిక (ఏకేవీ) అధ్యక్షుడు, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఖతార్ అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య, తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) అధ్యక్షుడు గడ్డె శ్రీనివాస్ చొరవ తీసుకుని బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు వివిధ తెలుగు సంఘాలు, ప్రవాసులు, నాయకులు, శ్రేయోభిలాషులను సమన్వయం చేశారు.

వారి పిలుపునకు స్పందించిన ప్రవాస తెలుగు సమాజం పెద్ద మనసుతో ముందుకు వచ్చి మొత్తం 42,966 ఖతార్ రియాల్స్ సేకరించింది. ఈ మొత్తాన్ని స్వర్గీయ మల్లేశ్ భార్యకు అందజేశారు.

ఏకేవీదే అత్యధిక సహాయం

ఈ సేవా కార్యక్రమంలో ఆంధ్ర కళా వేదిక (ఏకేవీ) 26,616 ఖతార్ రియాల్స్ అందించి అత్యధిక భాగస్వామ్యం కల్పించింది.

విరాళాల వివరాలు ఇలా ఉన్నాయి:

  • ఆంధ్ర కళా వేదిక (ఏకేవీ): 26,616 ఖతార్ రియాల్స్
  • తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్): 12,250 ఖతార్ రియాల్స్
  • తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ (టీడబ్ల్యూఏ): 3,100 ఖతార్ రియాల్స్
  • తెలంగాణ గల్ఫ్ సమితి (టీజీఎస్): 1,000 ఖతార్ రియాల్స్
  • మొత్తం: 42,966 ఖతార్ రియాల్స్

ఒక కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు సంస్థలు, ప్రాంతీయ భేదాలను పక్కనపెట్టి అందరూ ఒక్కటిగా నిలవడం ప్రవాస తెలుగు సమాజం ఐక్యతకు, మానవత్వానికి నిదర్శనమని నిర్వాహకులు తెలిపారు.

“ఇది కేవలం ఆర్థిక సహాయం కాదు.. మానవత్వానికి నిదర్శనం”

గొట్టిపాటి రమణయ్య మాట్లాడుతూ, కష్టకాలంలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం కేవలం ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాదని, “మన మానవత్వాన్ని చాటుకోవడం” అని అన్నారు.

మల్లేశ్ కుటుంబం విషాదంలో ఉన్న సమయంలో, ముఖ్యంగా ఆయన కుమార్తె వివాహం సమీపిస్తున్న తరుణంలో ప్రవాస తెలుగు సమాజం ఒక్కటిగా స్పందించడం ఎంతో హృదయస్పర్శగా ఉందన్నారు.

ఈ సహాయం కుటుంబానికి ఆర్థిక భరోసాతో పాటు “మీకు మేమున్నాం” అనే ఆత్మవిశ్వాసాన్ని కూడా అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన టీపీఎస్, ఏకేవీ, టీడబ్ల్యూఏ, టీజీఎస్ మేనేజ్‌మెంట్ కమిటీలకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే డా. అమూల్య రావు, లయోలా ఇంటర్నేషనల్ స్కూల్, ఖతార్ మేనేజ్‌మెంట్ అందించిన సహాయాన్ని కూడా అభినందించారు.

ఖతార్ తెలుగు సమాజానికి సౌదీ తెలుగు సంఘాల అభినందనలు

ఖతార్ ప్రవాస తెలుగు సమాజం చేసిన ఈ సేవకు TASA, SATA, శ్రీని హ్యుమానిటీ సర్వీస్ ప్రతినిధులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా తెలుగు ప్రజల సంక్షేమం కోసం గొట్టిపాటి రమణయ్య, గడ్డె శ్రీనివాస్ కలిసి ముందుకు వచ్చి సేవ చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

టాసా సౌదీ అరేబియా అధ్యక్షుడు తిరుపతిస్వామి స్వర్ణ, రియాద్ అధ్యక్షుడు మురారి తాటికాయల, ఉపాధ్యక్షుడు మహేంద్ర వాకాటి, అలాగే టాసా, సాటా, శ్రీని హ్యుమానిటీ సర్వీస్‌కు చెందిన పలువురు ముఖ్య సభ్యులు ఖతార్ తెలుగు సమాజానికి అభినందనలు తెలిపారు.

“ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వారికి అండగా నిలవాలి”

ప్రవాస తెలుగు సంఘాలు అందిస్తున్న సేవలు పరస్పరం స్ఫూర్తిగా నిలవాలని TASA, SATA, శ్రీని హ్యుమానిటీ సర్వీస్ ప్రతినిధులు ఆకాంక్షించారు.

తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఆపదలో ఉన్న తోటి తెలుగు వారికి అండగా నిలవడం ప్రతి తెలుగు సంఘం సామాజిక బాధ్యతగా భావించాలని వారు అన్నారు.

స్వర్గీయ సుంకై మల్లేశ్ కుటుంబానికి అందించిన ఈ సహాయం కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా ఆప్యాయత, మానవత్వం, సామాజిక బాధ్యతకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.

ప్రాంతం, సంస్థ, వ్యక్తిగత పరిచయాలకు అతీతంగా ప్రవాస తెలుగు సమాజం ఒక కుటుంబంలా స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవడం ఖతార్ తెలుగు సమాజం ఐక్యతకు గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఈ కార్యక్రమం “మనలో ఒకరు కష్టాల్లో ఉన్నప్పుడు మనమంతా ఒక్కటిగా నిలవాలి” అనే స్ఫూర్తిని ఆచరణలో చూపించింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com