సౌదీ అరేబియాలో GCC వాహనాలకు 90 రోజుల గడువు..!!

- August 23, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో GCC వాహనాలకు 90 రోజుల గడువు..!!

రియాద్: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల్లో రిజిస్టర్ అయిన ప్రైవేట్ వాహనాలు సౌదీ అరేబియాలో ఎంతకాలం ఉండవచ్చనే దానిపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇకపై ఇలాంటి వాహనాలు 365 రోజుల వ్యవధిలో గరిష్ఠంగా 90 రోజులు మాత్రమే సౌదీలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. జకాత్, ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ (ZATCA) గవర్నర్ సుహైల్ అబాన్మీ.. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయంతో ఈ నిబంధనలను ఆమోదించారు. 2026 ఆగస్టు 26 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.

ఇప్పటికే సౌదీలో ఉన్న వాహనాలకు 90 రోజుల గడువు

నిబంధనలు అమల్లోకి రాకముందే సౌదీ అరేబియాలో ఉన్న GCC రిజిస్ట్రేషన్ వాహనాల యజమానులకు తమ వాహనాల స్థితిని క్రమబద్ధీకరించుకునేందుకు 90 రోజుల గడువు ఇచ్చారు. ఈ గడువు ఆగస్టు 26 నుంచి నవంబర్ 23 వరకు కొనసాగుతుంది.
ఈ నిబంధనలు GCC దేశంలో రిజిస్టర్ అయిన ప్రైవేట్ వాహనాలకు వర్తిస్తాయి. సౌదీ పౌరులు, నివాసితులు, ప్రీమియం రెసిడెన్సీ కలిగినవారు యజమానులుగా ఉన్న వాహనాలతో పాటు.. సౌదీలోకి ప్రవేశించే సమయంలో పౌరుడు లేదా నివాసితుడు అధికారికంగా నడిపేందుకు అనుమతి పొందిన వాహనాలకూ ఇవి వర్తిస్తాయి.

365 రోజుల్లో 90 రోజులు మాత్రమే

GCC రిజిస్ట్రేషన్ ఉన్న వాహనం కస్టమ్స్ పోర్టు ద్వారా సౌదీలోకి ప్రవేశించిన తేదీ నుంచి లెక్కిస్తే 365 రోజుల వ్యవధిలో మొత్తం 90 రోజులు మాత్రమే దేశంలో ఉండవచ్చు. ఈ 90 రోజులు వరుసగా ఉండాల్సిన అవసరం లేదు. అంటే విడతల వారీగా సౌదీలో ఉన్న రోజులన్నింటినీ కలిపి 90 రోజుల పరిమితిని లెక్కిస్తారు. 

గడువు లోపు రెండు మార్గాలు

ఇప్పటికే సౌదీలో ఉన్న వాహనాల యజమానులు లేదా అధికారిక డ్రైవర్లు 90 రోజుల గ్రేస్ పీరియడ్‌లో తమ వాహనాల స్థితిని రెండు విధాలుగా క్రమబద్ధీకరించుకోవచ్చు. గడువు ముగిసేలోపు వాహనాన్ని సౌదీ నుంచి బయటకు తీసుకెళ్లడం. లేదా వాహనాన్ని శాశ్వతంగా ఇంపోర్ట్ చేసుకుని సౌదీలో రిజిస్టర్ చేసి సౌదీ నంబర్ ప్లేట్లు పొందవచ్చు.
ఇక శాశ్వతంగా రిజిస్టర్ చేయాలనుకునేవారు సమీప బోర్డర్ పోర్టు ద్వారా కస్టమ్స్ డిక్లరేషన్‌ను సమర్పించేందుకు కస్టమ్స్ బ్రోకర్‌కు అధికారం ఇవ్వవచ్చు. అనంతరం అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసి వర్తించే కస్టమ్స్ సుంకాలు, పన్నులు చెల్లించాలి. వాహనం మొదట సౌదీలోకి ప్రవేశించిన అదే పోర్టుకు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

Absher ద్వారా మరో 30 రోజుల పొడిగింపు

అసలు 90 రోజుల గడువు ముగియకముందే వాహనం యజమాని లేదా అధికారిక డ్రైవర్ అదనంగా గరిష్ఠంగా 30 రోజుల పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పొడిగింపు అసలు 90 రోజుల గడువు ముగిసిన తర్వాతి తేదీ నుంచి లెక్కిస్తారు. దరఖాస్తులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్ ద్వారా సమర్పించాలి. ఈ సేవ Absherలో అందుబాటులోకి రానుంది. వాహనానికి చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఉండాలి. అయితే 90 రోజుల అసలు గడువు ముగిసిన తర్వాత దాఖలు చేసే పొడిగింపు దరఖాస్తులను స్వీకరించరు.

SR2,000 వరకు జరిమానా

అనుమతించిన గడువు దాటిన తర్వాత కూడా వాహనం సౌదీలో ఉంటే SR1,000 నుంచి SR2,000 వరకు జరిమానా విధించవచ్చు. నిబంధనల ఉల్లంఘన పరిష్కరించే వరకు వాహనాన్ని సీజ్ చేసే అవకాశం కూడా ఉంది. వాహనాన్ని తరలించడం, సీజ్ చేయడం తదితర చర్యలకు అయ్యే ఖర్చులను కూడా యజమాని లేదా అధికారిక డ్రైవర్ భరించాల్సి ఉంటుంది.

ఉల్లంఘనను పరిష్కరించేందుకు వాహనాన్ని సౌదీలో చట్టబద్ధంగా రిజిస్టర్ చేయడం లేదా జరిమానాలు, ఇతర బకాయిలు చెల్లించి వాహనం సౌదీలోకి ప్రవేశించిన పోర్టు ద్వారా బయటకు తీసుకెళ్తామని హామీ ఇవ్వడం వంటి మార్గాలు ఉన్నాయి. అయితే ఈ కొత్త నిబంధనలు సౌదీ ట్రాఫిక్ లా, దాని అమలు నిబంధనలకు ఎలాంటి మార్పు చేయవని అధికారులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com