ఇరాన్‌ అధ‍్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ

- August 31, 2026 , by Maagulf
ఇరాన్‌ అధ‍్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ

బిష్కెక్: షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలతో పాటు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణ, తాజా పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు.

ఈ సందర్భంగా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల పై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న సమస్యలన్నింటినీ చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాల్సిందే అన్నది భారత్‌ స్థిరమైన వైఖరి అని స్పష్టం చేశారు.

ప్రాంతంలో దీర్ఘకాలిక శాంతి, స్థిరత్వం నెలకొల్పేందుకు నిరంతర ప్రయత్నాలు కొనసాగాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, రవాణాకు కీలకమైన సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత నావిగేషన్, వాణిజ్య కార్యకలాపాలను రక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఎలాంటి పరిస్థితుల్లోనూ పౌరులు, పౌర మౌలిక సదుపాయాలు, వాణిజ్య నౌకలు, నౌకా సిబ్బందికి హాని కలగకూడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

అంతర్జాతీయ వేదికలపై ఇరాన్‌తో కలిసి పనిచేయడానికి భారత్‌ సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. ముఖ్యంగా బ్రిక్స్ (BRICS), షాంఘై సహకార సంస్థ (SCO) వంటి బహుపాక్షిక సంస్థల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌ను భారత్‌కు ఆహ్వానించేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ సమావేశం భారత్‌–ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పశ్చిమాసియా శాంతి, స్థిరత్వంపై ఇరు దేశాల మధ్య సమన్వయానికి ప్రాధాన్యతను చాటింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com