షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్‌ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!

- September 01, 2026 , by Maagulf
షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్‌ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!

షార్జా: యూఏఈలో మిస్సింగ్ కేసు విషాదాంతమైంది.  కజకిస్థాన్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందినట్లు షార్జా పోలీసులు ధ్రువీకరించారు. మృతులు 20, 22 ఏళ్ల వయసు కలిగిన వారిగా అధికారులు తెలిపారు. షార్జాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వారి మృతదేహాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఇద్దరు యువతులు ఏడాది లోపే యూఏఈకి వచ్చి అక్కడే పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారు అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందిన అనంతరం షార్జా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్‌లో ఇద్దరినీ గుర్తించారు. అనంతరం వారి మృతికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించారు.

వాట్సాప్‌లో వైరల్‌గా పోస్టర్

ఇద్దరు యువతులు కనిపించకుండా పోయారంటూ గతంలో వాట్సాప్‌లో ఓ పోస్టర్ వైరల్ అయింది. రష్యన్ భాష మాట్లాడే ఓ కజక్ వ్యక్తితో వారు సంప్రదింపులు జరుపుతున్నారని, అతడే వారికి వసతి కల్పిస్తున్నట్లు పోస్టర్‌లో పేర్కొన్నారు. అలాగే ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలను తొలగించారని, ఫోన్, వాట్సాప్ ద్వారా కూడా వారిని సంప్రదించలేకపోతున్నట్లు అందులో పేర్కొన్నారు.

కేసుపై దర్యాప్తు పూర్తయిన తర్వాత ఇద్దరు మహిళల మృతికి సంబంధించిన పరిస్థితులు, ఇతర వివరాలను వెల్లడిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేస్తామని షార్జా పోలీసులు తెలిపారు. వారి మృతదేహాలను ఆగస్టు 28న కజకిస్థాన్‌కు తరలించారు. మృతదేహాల స్వదేశానికి తరలింపు ప్రక్రియలో షార్జా పోలీసులు కజకిస్థాన్ అధికారులతో కలిసి పనిచేశారు.

కాగా, ఇద్దరు యువతుల మృతిని కజకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ధ్రువీకరించింది. దుబాయ్‌లోని కజకిస్థాన్ కాన్సులేట్ జనరల్ వారి కుటుంబానికి అవసరమైన కాన్సులర్, న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపింది. మృతుల కుటుంబ సభ్యులు, యూఏఈ అధికారులతో సమన్వయం చేయడంతో పాటు అవసరమైన పత్రాల ప్రక్రియలోనూ కాన్సులేట్ సహకరిస్తున్నట్లు పేర్కొంది.

2025 డిసెంబర్‌లో యూఏఈకి

ఇద్దరు అక్కాచెల్లెళ్లు 2025 డిసెంబర్‌లో దుబాయ్‌కి వచ్చారు. ఓ బ్యూటీ సెలూన్‌లో పనిచేస్తూ అప్పటి నుంచి షార్జాలో నివసిస్తున్నారు. సెప్టెంబర్ ప్రారంభంలో కజకిస్థాన్‌కు వెళ్లి కుటుంబ సభ్యులను కలవాలని వారు భావించినట్లు కూడా వార్త కథనాలు పేర్కొన్నాయి. ఆగస్టు 17 నుంచి వారు కుటుంబ సభ్యులకు, ఇతరులకు సందేశాలకు స్పందించడం ఆపివేసినట్లు సమాచారం. కొన్ని రోజుల పాటు వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు దుబాయ్‌లోని కజకిస్థాన్ కాన్సులేట్‌ను సంప్రదించారు. అనంతరం మిస్సింగ్ ఫిర్యాదు అందడంతో షార్జా పోలీసులు గాలింపు చేపట్టి అపార్ట్‌మెంట్‌లో వారి మృతదేహాలను గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు, పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com