ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!

- September 01, 2026 , by Maagulf
ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!

దోహా: అనుమతులు లేకుండా వైద్య, కాస్మెటిక్ సేవలు అందిస్తున్న ముగ్గురు యూరోపియన్ జాతీయులను ఖతార్ అధికారులు అరెస్ట్ చేశారు. లైసెన్స్ లేని ఓ కేంద్రంలో వైద్య, సౌందర్య సంబంధిత కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) తెలిపింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌కు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం, ప్రజారోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సంబంధిత అధికారులతో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించింది.

లైసెన్స్ లేని కేంద్రంలో వైద్య, కాస్మెటిక్ సేవలు అందిస్తున్నారన్న సమాచారంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. సమాచారం నిజమని నిర్ధారించుకున్న అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అవసరమైన అనుమతులు తీసుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో సంబంధిత కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముగ్గురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తమపై ఉన్న ఆరోపణలను అంగీకరించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టైన ముగ్గురిని తదుపరి న్యాయపరమైన చర్యల కోసం సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించినట్లు తెలిపారు.

అనుమతులు లేని వైద్య లేదా కాస్మెటిక్ సేవల ప్రకటనలను నమ్మి సేవలు పొందవద్దని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించాయి. వైద్య సేవలు అందించే ప్రైవేట్ క్లినిక్ లేదా కేంద్రానికి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉందో లేదో, అక్కడ పనిచేస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి సంబంధిత అధికారుల అనుమతులు ఉన్నాయో లేదో ముందుగా నిర్ధారించుకోవాలని సూచించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com