తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- September 04, 2026
డాలస్, టెక్సస్: తానాసంస్థ సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాల గా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసినదే.
వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్ర భాషా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా తానా ప్రపంచసాహిత్యవేదిక “తెలుగే మన వెలుగు” అనే అంశంపై ఆదివారం జరిపిన 95వ అంతర్జాల సమావేశం సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ స్వాగతోపన్యాసంతో ప్రారంభంమై ఉల్లాసంగా జరిగింది.
ముఖ్యఅతిథి మరియు కీలకోపన్యాసకునిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ “తెలుగు భాష పరిరక్షణ, పరివ్యాప్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ఒక సలహా కమిటీని ఏర్పాటు చేసి తెలుగు భాషాభివృద్ధికి చేపట్టవలసిన చర్యల గురించి చర్చించి తగు విధివిధానాలను రూపొందిస్తాం అని అన్నారు. మన తెలుగు భాషకు అద్భుతమైన సేవ చేసిన మహనీయులను, ప్రముఖ వ్యక్తులను మరచిపోకూడదని అందువల్లనే మా ఉండి ప్రాంతంలో పుట్టిన తిరుపతి వెంకట కవులలో ఒకరైన తిరుపతిశాస్త్రి విగ్రహం మరియు చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే కొత్తగా కడుతున్న ఒక బ్రిడ్జికి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. ఎల్లాప్రగడ సుబ్బారావు బ్రిడ్జిగా నామకరణం చేస్తున్నామన్నారు. ఇలాంటి మహానుభావులు భావితరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు.”
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ఆంగ్ల భాష ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుంటూనే తెలుగుభాషను నిలబెట్టుకోవడంలో తల్లిదండ్రుల బాధ్యత గురుతరమైనదని అలాగే ప్రభుత్వం అన్ని శాఖలలోను తెలుగుభాషను వాడాలని, పరిపాలనా భాషగా తెలుగు ఉండాలని, ఆంగ్లంలో వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులన్నీ వెంటనే తెలుగులో అనువాదం అయ్యేటట్లు చూడాలని, దానివల్ల ఆంగ్లం, తెలుగు రెండు భాషలు వచ్చిన వారికి కొన్ని ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కనీసం ఐదవ తరగతి వరకు మాతృబాషలో విద్యాభోదన జరగవలసిన అవసరం ఉందన్నారు.”
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆచార్య డా. శలాక రఘునాధ శర్మ మాట్లాడుతూ ”ఎన్ని భాషలలోని పదాలనైనా అవలీలగా తనలొ మిళితం చేసుకోగల శక్తి గల గొప్ప భాష తెలుగు అని, అందుకే పరభాషీయులు, శ్రీ కృష్ణ దేవరాయలతో సహా విదేశీయులు సైతం మన తెలుగు భాషా వైభవాన్ని మెచ్చుకున్నారన్నారు. మన తెలుగుభాషను విస్తృతం చెయ్యడంలో నిర్లక్ష్యం తగదన్నారు.”
విశిష్టఅతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతికశాఖ సంచాలకులు రేగుళ్ళ మల్లికార్జునరావు తెలుగు భాషా, సంస్కృతులకు పాటుపడుతున్న వారికి ప్రతి సంవత్సరం తెలుగు భాషా పురస్కారాలు, కళారత్న పురస్కారాలు అందజేస్తున్నామన్నారు.
గిడుగు రామమూర్తి మునిమనుమరాలు గిడుగు లక్ష్మీ కాంతికృష్ణ తన ముత్తాత గిడుగు రామమూర్తి ఎన్నో ప్రతికూల పరిస్థితులను తట్టుకుని గ్రాంధిక భాషను వ్యవహారిక భాషగా తీర్చి దిద్దారన్నారు. మేము కూడా ఆయన అడుగుజాడలలో నడుస్తూ గిడుగు రామమూర్తి ఫౌండేషన్ ను స్థాపించి ప్రతి సంవత్సరం భాషా సాహిత్య వికాసాల కోసం కృషిచేసిన వారికి పురస్కారాలందిస్తున్నామన్నారు.
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు డా. మాడభూషి సంపత్ కుమార్ మాట్లాడుతూ ” తెలుగుకు ప్రాచీన భాష హోదా తెచ్చుకోవడంలో సఫలీకృతం అయినప్పటికీ, కేంద్రప్రభుత్వంనుండి నిధులు తెచ్చుకోవడంలో వెనుకబడే ఉన్నామని, ఈ విషయంలో మన పార్లమెంట్ సభ్యుల సహకారం అవసరం అన్నారు.”
తెలుగు భాషోద్యమ సమాఖ్య కార్యదర్శి డా. గుంటుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ “ పిల్లలకు తెలుగు భాషను నేర్పడంలో అధునాతనమైన పద్దతులను వాడాలని, కేవలం వారికి వచ్చే మార్కులతో సంతృప్తి పడకుండా వారికి భాష ఎంతవరకు పట్టుబడుతుంది అని ఆలోచించాలి, క్షేత్ర స్థాయిలో మార్పులపట్ల ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.”
సీనియర్ జర్నలిస్ట్ రమేశ్ కందుల మాట్లాడుతూ “ కాలక్రమేణా తెలుగుభాష అన్ని రంగాలలోను మార్పులు చెందుతూ వస్తుందని, అందరం కలసి తెలుగుభాషకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేద్దాం అన్నారు.”
తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర పాల్గొన్న అతిథులకు, ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలను తెలియజేశారు.
పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును.
https://youtube.com/live/cIDCCp8L4iQ
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







