సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన

- September 05, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన

రియాద్: కేంద్ర విదేశీ వ్యవహారాలు, పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రిగా సౌదీ అరేబియాలో ఆయన చేపట్టనున్న తొలి అధికారిక పర్యటన ఇదే కావడం విశేషం.

పర్యటనలో భాగంగా మంత్రి సౌదీ అరేబియా మానవ వనరులు, సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి, వాతావరణ వ్యవహారాల ప్రత్యేక దూత, పర్యావరణం, నీరు మరియు వ్యవసాయ శాఖ ఉపమంత్రి తదితర ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.

ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనం కలిగించే పలు అంశాలపై ఈ సమావేశాల్లో చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ వ్యవహారాలు వంటి అంశాలు చర్చకు రానున్నాయి.

పర్యటన సందర్భంగా కీర్తి వర్ధన్ సింగ్ సౌదీ అరేబియాలోని భారతీయ సమాజానికి చెందిన వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అలాగే భారతీయ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, నిపుణులతోనూ ఆయన భేటీ అవుతారు.

భారతీయ కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను మంత్రి తెలుసుకోనున్నారు. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల సంక్షేమానికి భారత ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ పర్యటన మరోసారి చాటనుంది.

భారత్-సౌదీ అరేబియా మధ్య ఇప్పటికే కొనసాగుతున్న బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని భావిస్తున్నారు. మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి నుంచి పర్యావరణం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ అంశాల వరకు ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఈ పర్యటన కీలకంగా మారనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com