కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!

- September 05, 2026 , by Maagulf
కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!

కువైట్: ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన వాహనాల నుంచి డీజిల్‌ను అక్రమంగా తీసి, స్థానిక ప్రాజెక్టులకు విక్రయిస్తున్న ముఠా నెట్ వర్క్ ను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ఛేదించింది. ఈ ఆపరేషన్‌లో 41 మంది అనుమానితులను అరెస్ట్ చేయడంతో పాటు 38 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.  
విచారణలో పలువురు డ్రైవర్లు తమ విధుల్లో భాగంగా తమకు అప్పగించిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల వాహనాల నుంచి యజమానులకు తెలియకుండా డీజిల్‌ను కొంత మొత్తంలో బయటకు తీస్తున్నట్లు గుర్తించారు. చోరీ చేసిన డీజిల్‌ను అమ్‌ఘరా ప్రాంతంలోని ఓ ప్రదేశానికి తరలించి, అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాంకర్లలో నిల్వ చేసేవారని అధికారులు తెలిపారు. అనంతరం ఈ డీజిల్‌ను కువైట్‌లోని వివిధ ప్రాజెక్టులకు అక్రమంగా విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

నెలకు 1,600 కువైట్ దినార్ల చెల్లింపు

డీజిల్‌ను సేకరించేందుకు ఉపయోగించిన ట్యాంకర్లను ఓ కువైట్ పౌరుడు నెలకు 1,600 కువైట్ దినార్లకు అందించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా, ఆ ట్యాంకర్లను అక్రమ డీజిల్ చోరీ, నిల్వ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న విషయం కూడా అతడికి తెలుసునని విచారణలో తేలినట్లు పేర్కొంది.

ఒక వాహనం నుంచి డీజిల్‌ను బయటకు తీస్తున్న ప్రధాన నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో డీజిల్‌ను చోరీ చేసిన వారు, విక్రయించిన వారు, కొనుగోలు చేసిన వారు, అలాగే వారితో అక్కడ ఉన్న ఇతర వ్యక్తులు కలిపి మొత్తం 41 మందిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలకు చెందిన 38 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com