యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!

- September 05, 2026 , by Maagulf
యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!

దుబాయ్: యూఏఈలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులను వారం రోజుల ముందుకు మార్చాయి. తాజా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 12 నుంచి 16 వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నట్లు విద్యార్థులు, తల్లిదండ్రులకు పాఠశాలలు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 19 నుంచి 23 వరకు హాఫ్‌టర్మ్ సెలవులు ఉండాల్సి ఉంది. అయితే విద్యా మంత్రిత్వ శాఖ (MoE), దుబాయ్‌లోని నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHDA) అమలు చేస్తున్న విద్యా క్యాలెండర్‌కు అనుగుణంగా తేదీలను మార్చినట్లు పాఠశాలలు వెల్లడించాయి. దుబాయ్ బ్రిటిష్ స్కూల్, సఫా బ్రిటిష్ స్కూల్, అరబ్ యూనిటీ స్కూల్ వంటి పలు పాఠశాలలు ఇప్పటికే తల్లిదండ్రులకు ఈ మార్పుపై నోటీసులు పంపినట్లు తెలిపాయి.

సెలవుల తేదీల మార్పుపై తల్లిదండ్రుల అసంతృప్తి

తేదీలు మారడంతో గతంలో ప్రకటించిన షెడ్యూల్ ఆధారంగా సెలవుల కోసం ప్రయాణాలు, ఇతర కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్న తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు తల్లిదండ్రులు ఇప్పటికే విమాన టికెట్లు, టూర్ ప్యాకేజీలు బుక్ చేసుకున్నామని, ఇప్పుడు వాటిని మార్చుకోవడం లేదా రద్దు చేసుకోవడం వల్ల ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. బ్రిటిష్ సిలబస్‌లో చదువుతున్న విద్యార్థుల షెడ్యూల్‌పై కూడా ఈ మార్పు ప్రభావం చూపుతుందని ఓ తల్లిదండ్రి పేర్కొన్నారు. ముఖ్యంగా 13వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఇదే సమయంలో ఉండటంతో సెలవు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చని తెలిపారు.

ఇదిలా ఉండగా, షార్జాలోని కొన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు హాఫ్‌టర్మ్ సెలవులపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది.ఫిబ్రవరిలో యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు తదుపరి మూడేళ్ల విద్యా క్యాలెండర్‌ను ప్రకటించింది. అందులో అక్టోబర్ 12 నుంచి బ్రేక్ ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. అయితే స్థానిక విద్యా నియంత్రణ సంస్థలకు తమ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల నిర్వహణ అవసరాలకు అనుగుణంగా అక్టోబర్, ఫిబ్రవరి మధ్య సెలవులను విభజించుకునే వెసులుబాటు కల్పించారు. ఈ నేపథ్యంలో కొన్ని పాఠశాలలు తమ విద్యా కార్యకలాపాలకు అనుగుణంగా సెలవుల తేదీల్లో మార్పులు చేస్తున్నాయి. తేదీల మార్పుతో తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యానికి పాఠశాలలు క్షమాపణలు కూడా చెబుతుండటం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com