గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!

- September 06, 2026 , by Maagulf
గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!

హైదరాబాద్:  తెలంగాణలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుపై మరో కీలక అడుగు పడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో Airports Authority of Indiaప్రతిపాదిత విమానాశ్రయానికి అనువైన స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖకు చెందిన సాంకేతిక బృందం 2026 సెప్టెంబర్ 7న జిల్లాలో పర్యటించనుంది. సుమారు నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ ప్రాంతాలను బృందం పరిశీలించే అవకాశం ఉంది.

భౌగోళిక పరిస్థితులు, కొండలు, రైల్వే మార్గాలకు సమీపం :
గతంలో రామవరం, చుంచుపల్లి, సుజాతనగర్ ప్రాంతాల్లో ప్రతిపాదించిన స్థలాలు భౌగోళిక పరిస్థితులు, కొండలు, రైల్వే మార్గాలకు సమీపం వంటి కారణాలతో విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేవని తేలింది. తాజా పరిశీలనలో సాంకేతిక, భద్రతా, ఆపరేషనల్ అంశాలను ప్రధానంగా అంచనా వేయనున్నారు. గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల విషయంలో Airports Authority of India (AAI) నిర్వహించే ప్రీ-ఫీజిబిలిటీ అధ్యయనం కీలకమైనది. సైట్ ఎంపిక, సాధ్యాసాధ్యాల అధ్యయనం, అబ్స్టాకిల్ లిమిటేషన్ సర్వే, వాతావరణ డేటా విశ్లేషణ తదితర అంశాలను AAI పరిశీలిస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనంతరగావ్, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, జక్రాన్‌పల్లి ప్రాంతాల్లో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల కోసం ప్రీ-ఫీజిబిలిటీ అధ్యయనాలను ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వానికి 2025లో సమర్పించిన వివరాల ప్రకారం కొత్తగూడెం, మహబూబ్‌నగర్ స్థలాలు అనుకూలంగా లేవని, జక్రాన్‌పల్లి స్థలం కొన్ని షరతులతో సాంకేతికంగా అనుకూలమని తేలింది.

కొత్తగూడెం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటైతే భద్రాచలం, కొత్తగూడెం పరిసర ప్రాంతాలకు విమాన కనెక్టివిటీ మెరుగుపడటంతో పాటు పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు ఊతం లభించే అవకాశం ఉంది. తాజా సైట్ పరిశీలన ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు నిర్ణయించే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com