త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!

- September 07, 2026 , by Maagulf
త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!

రియాద్: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాల మధ్య పర్యాటకుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది. జీసీసీ సెక్రటరీ జనరల్ జాసెం అల్‌బుదైవీ ఈ విషయాన్ని వెల్లడించారు. రియాద్‌లో  జరిగిన ‘సెక్యూరిటీ అండ్ హిస్టరీ డైలాగ్ 2026’ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఈ వీసా అమల్లోకి రావడం గల్ఫ్ దేశాల మధ్య సమగ్రతను మరింత బలోపేతం చేసే కీలక ముందడుగు అని పేర్కొన్నారు.

యూనిఫైడ్ వీసా ద్వారా విదేశీ సందర్శకులు జీసీసీలోని ఆరు దేశాల మధ్య మరింత సులభంగా ప్రయాణించగలరని తెలిపారు. దీంతో పర్యాటక రంగానికి ఊతం లభించడంతో పాటు, గల్ఫ్ ప్రాంతం ఒక సమగ్ర అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా మరింత గుర్తింపు పొందుతుందని చెప్పారు. జీసీసీ దేశాల మధ్య భద్రతా సమన్వయం బలంగా కొనసాగుతోందని అల్‌బుదైవీ తెలిపారు. ఇటీవల జీసీసీ దేశాలపై జరిగిన ఇరాన్ దాడుల నేపథ్యంలో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయాలు సభ్య దేశాల భద్రత, స్థిరత్వాన్ని మరింత పటిష్టం చేయడంలో దోహదపడ్డాయని పేర్కొన్నారు.

సైబర్ నేరాలు, ఏఐ సవాళ్లపై ఉమ్మడి వ్యూహం

డిజిటల్ రంగంలో యువత ఎదుర్కొంటున్న ప్రమాదాల విషయంలో జీసీసీ దేశాలు అప్రమత్తంగా ఉన్నాయని అల్‌బుదైవీ తెలిపారు. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు జీసీసీ దేశాలు ఇప్పటికే ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు. అలాగే ఏఐ వినియోగానికి సంబంధించి కూడా గల్ఫ్ దేశాలు సంయుక్త వ్యూహాన్ని రూపొందించాయని తెలిపారు. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు, దానివల్ల ఎదురయ్యే సవాళ్లను కూడా సమర్థంగా ఎదుర్కోవడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు.

మాదకద్రవ్యాలపై ఉమ్మడి పోరాటం

గల్ఫ్ సమాజాలను, ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాల వ్యాప్తికి కొన్ని ముఠాలు, సంస్థలు, దేశాలు ప్రయత్నిస్తున్నాయని అల్‌బుదైవీ ఆందోళన వ్యక్తం చేశారు. గల్ఫ్ యువతను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న మాదకద్రవ్యాల తయారీ కేంద్రాల గురించి తమ వద్ద సమాచారం ఉందని తెలిపారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు గత ఏడాది జీసీసీ దేశాలు మాదకద్రవ్యాల నియంత్రణపై ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాయని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com