కొత్త ప్రభుత్వ సీజన్‌ పై షేక్ మహమ్మద్ సమీక్ష..

- September 09, 2026 , by Maagulf
కొత్త ప్రభుత్వ సీజన్‌ పై షేక్ మహమ్మద్ సమీక్ష..

దుబాయ్: యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ రూలర్  షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 2026–2027 కొత్త ప్రభుత్వ సీజన్‌లో ప్రభుత్వ ప్రాధాన్యతలు, కీలక దిశానిర్దేశాలు, చేపట్టాల్సిన ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. వార్షిక ‘న్యూ గవర్నమెంట్ సీజన్ మీటింగ్ 2026–2027’లో భాగంగా ఆయన తన బృందాలతో పాటు పలువురు సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ డిప్యూటీ ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి హిజ్ హైనెస్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, దుబాయ్ రెండో డిప్యూటీ పాలకుడు హిజ్ హైనెస్ షేక్ అహ్మద్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ హాజరయ్యారు.

ప్రభుత్వ బృందాల కృషికి ప్రశంస

గత ప్రభుత్వ సీజన్‌లో బృందాలు సాధించిన విజయాలను షేక్ మహమ్మద్ ప్రశంసించారు. ప్రభుత్వ కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచడం, జాతీయ ప్రాధాన్యతల అమలును వేగవంతం చేయడం, ప్రజా సేవలను మరింత మెరుగుపరచడం, యూఏఈ సమగ్ర అభివృద్ధి ప్రయాణానికి మద్దతు ఇవ్వడంలో అధికారులు చేసిన కృషి కీలకమని ఆయన పేర్కొన్నారు.

కొత్త ప్రభుత్వ సీజన్‌లో ప్రభుత్వ బృందాలు మరింత ఉత్సాహంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ప్రాజెక్టులు, ప్రాధాన్యతల అమలును వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ విభాగాలు, బృందాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. మరింత సమర్థవంతమైన, చురుకైన, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన విధానాలను అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.

‘ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రభుత్వంగా యూఏఈ ఉండాలి’

సమావేశంలో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ మాట్లాడుతూ..“ప్రతి ప్రభుత్వ సీజన్ ప్రారంభమైనప్పుడు నా బృందాన్ని కలవడంతోనే నా పనిని ప్రారంభిస్తాను. కొత్త సీజన్‌ను కొత్త ఉత్సాహం, బలమైన సంకల్పం, మన దేశ స్థాయికి తగిన లక్ష్యాలతో ప్రారంభిస్తున్నాం.”అని అన్నారు.

తన బృందానికి ఎప్పుడూ ఒకే సందేశం ఇస్తున్నానని పేర్కొంటూ,“యూఏఈ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రభుత్వంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.” అని షేక్ మహమ్మద్ తెలిపారు.

అభివృద్ధి, సామాజిక, ఆర్థిక రంగాల పై దృష్టి

గత ప్రభుత్వ సీజన్‌లో సాధించిన ముఖ్యమైన విజయాలతో పాటు రాబోయే కాలంలో చేపట్టాల్సిన ప్రాధాన్యతలు, కార్యక్రమాలు, ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు. అభివృద్ధి, సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడం, ప్రభుత్వ విభాగాలను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మరింత సిద్ధంగా ఉంచడంపై దృష్టి సారించారు.

అలాగే ఫెడరల్ ప్రభుత్వ పనితీరు వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడం, వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, జాతీయ ప్రతిభను ప్రోత్సహించడం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి.

యూఏఈ పోటీతత్వాన్ని మరింత పెంచడంతో పాటు ప్రపంచ స్థాయిలో ప్రభుత్వ పనితీరులో తన అగ్రస్థానాన్ని కొనసాగించేందుకు అవసరమైన చర్యలపై సమావేశం దృష్టి సారించింది.

ఈ సమావేశానికి క్యాబినెట్ వ్యవహారాల మంత్రి మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ గెర్గావీతో పాటు పలువురు మంత్రులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com