బాలల నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘పాడనా తెలుగు పాట’

- September 09, 2026 , by Maagulf
బాలల నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘పాడనా తెలుగు పాట’

ఒంగోలు: ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 5, 6 తేదీల్లో ఒంగోలులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్న నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు – బాలలు కార్యక్రమంలో భాగంగా ‘పాడనా తెలుగు పాట’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పరిషత్తు అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు.

దివ్యశ్రీ డా. భానుమతి రామకృష్ణ వేదికపై 16 ఏళ్ల లోపు బాలబాలికల కోసం రెండు రోజులపాటు ఈ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. కరోకే మాధ్యమం ద్వారా తెలుగు పాటలను ఆలపించే ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన బాలబాలికలు ప్రాథమిక పరిశీలన, ఎంపిక కోసం రెండు గీతాలను కరోకే మాధ్యమంలో రికార్డు చేసి పంపించాలని నిర్వాహకులు తెలిపారు.

రికార్డు చేసిన గీతాలను [email protected] ఈమెయిల్ చిరునామాకు సెప్టెంబర్ 30లోపు శ్రీ జొన్నలగడ్డ వల్లీ శ్రీవిద్యకు పంపించాలి. ఎంపికైన వారికి అక్టోబర్ 15లోపు నేరుగా సమాచారం అందజేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఎంపికైన బాలబాలికలు వేదికపై ఒక సోలో గీతం, ఒక యుగళ గీతం ఆలపించాల్సి ఉంటుంది. తెలుగు సాహిత్య, సంగీత విలువలు కలిగిన గీతాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అశ్లీలతకు తావిచ్చే గీతాలు, జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే గీతాలను ఈ కార్యక్రమంలో అనుమతించబోమని స్పష్టం చేశారు.

ఎంపికైన బాలబాలికలకు స్థానికంగా డార్మిటరీ సదుపాయం, స్థానిక రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనే వారిని వేదికపై ప్రశంసా పత్రం, శాలువా, పతకంతో ఘనంగా సత్కరించనున్నట్లు పరిషత్తు కార్యదర్శి రెడ్డప్ప ధవేజి, సమన్వయకర్తలు డా.కే.మురళీధర్ రెడ్డి,కోగంటి శ్రీకాంత్ తెలిపారు.

తెలుగు భాష, సాహిత్యం, సంగీతంపై బాలల్లో ఆసక్తిని పెంపొందించడంతో పాటు, వారి ప్రతిభకు వేదిక కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com