నిర్మాత మధు కలిపు తో మాగల్ఫ్ ముఖాముఖీ

- September 10, 2026 , by Maagulf
నిర్మాత మధు కలిపు తో  మాగల్ఫ్ ముఖాముఖీ

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్. ‘మహేంద్రగిరి వారాహి’. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మధు కలిపు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీ సినీ ప్రయాణం గురించి చెప్పండి?
-నాకు ముందేం సినిమా నేపథ్యం లేదు. దర్శకుడు శేఖర్ కమ్ములతో 'హ్యాపీడేస్' సమయం నుంచి పరిచయం ఉంది. అలాగే కిరణ్, అడివి శేష్ గారు కూడా నాకు మంచి మిత్రులు. అలా నేను సినిమాల్లోకి వచ్చాను. అంతకంటే ముందు బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాల్లో వ్యాపారాలు చేశాను.

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ఎలా మొదలైంది?
-'రంగమార్తాండ' తర్వాత మరొక మంచి సినిమా చేయాలనుకుంటున్న సమయంలో దర్శకుడు సంతోష్ ఈ వారాహి అమ్మవారి స్క్రిప్ట్ చెప్పారు. కథ బాగా నచ్చడంతో ప్రాజెక్ట్ ప్రారంభించాము. ఇది అద్భుతమైన కథ. పైగా మా బ్యానర్ పేరు 'రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్' కావడం, అది కూడా అమ్మవారి పేరే కావడంతో ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది.

చాలా మంది స్టార్స్ వున్నారు కదా?
-అవునండి. సుమంత్, సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ ఇలా అద్భుతమైన నటీనటులు నటించిన పర్ఫెక్ట్ మల్టీస్టారర్ ఇది. సుమంత్ గారి నటన అద్భుతంగా ఉంటుంది. ఐశ్వర్య రాజేష్ అమ్మవారి రూపంలో చాలా అద్భుతంగా కనిపిస్తారు. సిద్దు పాత్ర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆయనతో నాకు ముందే పరిచయం ఉంది. ఈ కథ పాత్ర నచ్చి చేశారు.  

-ఈ కథ వారాహి అమ్మవారి చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. మేము ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్ తో సినిమాని గ్రాండ్ గా తీశాం.  

లక్ష్మణ్ గారు ఎలా వచ్చారు?
-లక్ష్మణ్ ‘రంగమార్తాండ’ నుంచి నా తోడున్నారు.ఈ కథ నచ్చి ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.

సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్, విజువల్స్ ఎలా ఉంటాయి?
- డివోషనల్ ఎలిమెంట్స్‌తో వస్తున్న సినిమా ఇది. కథలో ఏముందో ఎక్కడా రాజీ పడకుండా తీశాం. దాదాపు గంట పాటు విఎఫ్ఎక్స్ (VFX) వర్క్ ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో చేయించిన ఈ వర్క్ అంతా చాలా నేచురల్‌గా, అద్భుతంగా వచ్చింది. అలాగే సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మేజర్ అసెట్‌గా నిలుస్తాయి.

చిత్రీకరణ ఎక్కడెక్కడ జరిపారు?
-మేము దాదాపుగా అన్నీ ఒరిజినల్ లొకేషన్లలోనే తీశాం. రామచంద్రపురం కోట, ముచ్చింతల్, గండికోట, ఒరిస్సాలోని వివిధ ప్రాంతాల్లో షూట్ చేశాం. కేవలం అమ్మవారి గర్భగుడికి మాత్రం ఒక భారీ సెట్ వేశాం.  

బ్రహ్మానందం పాత్ర గురించి?
-బ్రహ్మానందం క్యారెక్టర్ చాలా డివోషనల్‌గా ఉంటుంది. ఇప్పటివరకు ఆయన ఇలాంటి పాత్ర చేయలేదు, చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రభావం ఉందా?
-పవన్ కళ్యాణ్  'వారాహి' యాత్ర వల్ల ఈ పేరుకు మంచి ప్రచారం వచ్చింది. ఆ తర్వాత వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు జరగడం, కాకినాడలో ఆలయ నిర్మాణం జరగడం చూశాం. పవన్  భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలిచి అద్భుతమైన ఫలితాలు పొందారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉంటాయి.

బిజినెస్ గురించి?
-సినిమా టీజర్‌తోనే ఓటీటీ డీల్స్ క్లోజ్ అయిపోయాయి. ట్రైలర్ విడుదలయ్యాక చాలామంది థియేట్రికల్ కోసం అడిగారు, కానీ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా మేమే సొంతంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నాము. దాదాపు 900 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నాం.

-ప్రమోషన్లలో భాగంగా దాదాపు 150 థియేటర్లలో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించాము. సినిమాకి చాలా క్రేజ్ ఉంది. ఫైనల్ అవుట్ పుట్ నిన్ననే చూశాను. అద్భుతంగా వచ్చింది.

-శిరీష్ నెల రోజుల ముందే డబుల్ పాజిటివ్ చూసి ఫుల్ మార్కులు వేశారు.  

-ప్రేక్షకులు ఈ సినిమా చూసి చాలా గొప్ప భక్తి భావంతో అమ్మవారికి నమస్కరించి ధియేటర్ నుంచి బయటకు వస్తారు.  

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లు ఏమిటి?
-దర్శకుడు సంతోష్‌తో మరొక సినిమా చేసే ఆలోచన ఉంది. దాంతో పాటు ఒక హాలీవుడ్ స్టూడియోతో కలిసి నేరుగా ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఒక హారర్ సినిమా చేస్తున్నాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com