4 మిలియన్ల ప్రయాణికులకు సిద్ధమైన ఖతార్..!!
- September 10, 2026
దోహా: వింటర్ లో భారీ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA), ఖతార్ ఎయిర్వేస్ విస్తృత కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశాయి. రానున్న వింటర్ సీజన్లో ప్రపంచవ్యాప్తంగా 170కిపైగా గమ్యస్థానాలకు సేవలు అందించే ఖతార్ ఎయిర్వేస్ నెట్వర్క్ ద్వారా సుమారు 4 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన మీడియా టూర్ సందర్భంగా ఈ వివరాలను వెల్లడించారు. ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హమద్ అలీ అల్-ఖాతర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 28న ఎదురైన తీవ్ర సవాలును అధిగమించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఏడాది నమోదైన ప్రయాణికుల సంఖ్యలో దాదాపు 90 నుంచి 95 శాతానికి తిరిగి చేరుకున్నామని చెప్పారు. విమానాల ఆక్యుపెన్సీ కూడా చాలా ఎక్కువగా ఉందని, గతంలో సుమారు 60 గమ్యస్థానాల నుంచి ప్రస్తుతం 160 గమ్యస్థానాలకు సేవలను విస్తరించామని తెలిపారు.
2026లో 96,031 ప్యాసింజర్ ఫ్లైట్లు
జనవరి నుంచి ఆగస్టు 2026 మధ్య ఖతార్ ఎయిర్వేస్ మొత్తం 96,031 ప్యాసింజర్ విమానాలను నడిపింది. 239 ప్రయాణికుల విమానాలతో కూడిన ఫ్లీట్‌తో రోజుకు సగటున 510కిపైగా విమానాలను అంతర్జాతీయ మార్గాల్లో నడుపుతోంది. జూన్ మధ్య నుంచి విమాన కార్యకలాపాలు క్రమంగా పుంజుకున్నాయని అల్-ఖాతర్ తెలిపారు. వచ్చే ఏడాది Airbus A350-1000, Boeing 777-9 వంటి కొత్త విమానాలు ఫ్లీట్‌లో చేరనున్నాయని చెప్పారు. అలాగే Qsuite Next Genను వచ్చే వేసవి నుంచి ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు.
రోజుకు 1.4 లక్షల మందికిపైగా ప్రయాణికులు
ఖతార్ ఎయిర్వేస్కు ప్రధాన హబ్‌గా ఉన్న హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏడాదికి 65 మిలియన్లకుపైగా ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 8,45,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న సింగిల్ టెర్మినల్‌లో 138 చెక్-ఇన్ కౌంటర్లు, 62 కాంటాక్ట్ గేట్లు ఉన్నాయి. ప్రయాణికుల కోసం 6,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇండోర్ ట్రాపికల్ గార్డెన్ ‘ది ఆర్చర్డ్’ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంది. హమద్ విమానాశ్రయంలో ప్రస్తుతం రోజుకు 1,40,000 మందికిపైగా ప్రయాణికుల రాకపోకలు జరుగుతున్నాయని ఖతార్ ఎయిర్వేస్ గ్రూప్ CEO తెలిపారు.
ప్రయాణికుల కోసం ‘Travel Recovery Studio’
ప్రయాణికులు విమానాల మధ్య విశ్రాంతి తీసుకునేందుకు HIA ‘Travel Recovery Studio’ను ప్రారంభించింది. సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 25 వరకు Concourse Cలోని Orchard వద్ద ఈ ఉచిత సదుపాయం అందుబాటులో ఉంటుంది. నిపుణుల ఆధ్వర్యంలో జరిగే 20 నిమిషాల వెల్నెస్ సెషన్లలో తేలికపాటి స్ట్రెచింగ్, శ్వాస వ్యాయామాలు, రెడ్ లైట్ థెరపీ మ్యాట్స్ వంటి సదుపాయాలు ఉంటాయి.
సెల్ఫ్-సర్వీస్ సేవలకు పెరుగుతున్న ఆదరణ
2026 తొలి ఏడు నెలల్లోనే హమద్ విమానాశ్రయ గ్రౌండ్ సర్వీసుల ద్వారా 94 లక్షల మంది డిపార్చర్ ప్రయాణికుల ప్రయాణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 3,19,000 మంది ప్రయాణికులు సెల్ఫ్-సర్వీస్ చెక్-ఇన్ కియోస్క్‌లను, మరో 74,000 మంది సెల్ఫ్-సర్వీస్ బ్యాగ్ డ్రాప్ సేవలను వినియోగించారు. వింటర్లో పెరిగే రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు ఈ సాంకేతికతలు, మౌలిక సదుపాయాలు కీలకంగా మారనున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!







