ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్..

- September 10, 2026 , by Maagulf
ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్..

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మ రథం పడుతున్నారు. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా నేటికీ స్ట్రాంగ్ కలెక్షన్స్ నమోదు చేస్తుండటం విశేషం. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరును కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు మేకర్స్.

ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ.. మా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ చాలా చాలా థాంక్స్. ఇక నేను మాట్లాడటానికి ఏమీ లేదు.. అందరూ ఈ సక్సెస్ గురించి ఎంతో చెప్పారు. ఈ సినిమా నాకు విపరీతమైన సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఎంతో రెస్పెక్ట్ తెచ్చి పెట్టింది. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ వేల వేల కృతజ్ఞతలు. మమ్మల్ని శివ ఎన్నో నైట్స్ కష్టపెట్టి సూపర్ సక్సెస్ ఇచ్చారు. సినిమా సెట్స్ లో అందరం ఎంతో సరదాగా ఎంజాయ్ చేశాము. కోట శ్రీనివాసరావు బాబాయ్ అంత టాలెంట్ ఉన్న నటుడు అజయ్ ఘోష్. ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు. సాయి అన్న, ప్రియా భవాని మీరు సూపర్ అంతే. చాలా మంది నాకు ఫోన్స్ చేస్తూ ఒక్కో సీన్ గురించి వాళ్ళ రియాక్షన్స్ చెబుతుంటే నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సినిమాతో నాకు ఇంత రెస్పెక్ట్ వచ్చింది అంటే ఆ క్రిడిట్ మొత్తం నివ నిర్వాణకే. యాక్టర్ గా నేను ఇప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇరుముడి అంటే శివ, శివ అంటే శివ నిర్వాణ. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్'' అన్నారు.                        

రైటర్, ప్రొడ్యూసర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ.. ''ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. శివ నిర్వాణ న్యూ ఏజ్ ఫిలిం మేకర్. ఈ సినిమా ఓకే చేసిన తర్వాత రవితేజకు కాల్ చేసి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పా. అప్పటిదాకా నాకు ఇరుముడి అనే టైటిల్ తెలియదు, ఇది అయ్యప్ప సినిమా అని కూడా తెలియదు కానీ నాకు ఒక్కటే నమ్మకం శివ నిర్వాణ టైప్ మేకింగ్. ఈ సినిమా కోసం రవితేజ ఎంతో కష్టపడ్డారు. ఆయన లాగా ఐక్యూ ఉన్న హీరోలు చాలా అరుదు. డైరెక్టర్ ని నమ్మిన హీరోలు, కథను నమ్మిన ప్రొడ్యూసర్స్ ఉన్నంత కాలం సినిమాలు హిట్ అవుతూనే ఉంటాయి. తెలుగు సినిమా గతిని మార్చేసిన ఘనత మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలదే. ఇరుముడి సినిమాలో నటులు లేరు క్యారెక్టర్స్ ఉన్నాయి. సాయి కుమార్ అయితే గురు స్వామిగా ఓ మార్క్ క్రియేట్ చేశారు. ఆయన తప్ప ఈ సినిమా ఎవ్వరూ చేయలేరేమో. మంచి సినిమా చేస్తే నిజాయితీగా డబ్బులొస్తాయని నిరూపించింది ఇరుముడి. జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలం'' అన్నారు.

రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ.. ''ఇరుముడి కథ మొదట విన్నది నేనే. అందుకే ఈ సినిమాకు ఫస్ట్ ప్రేక్షకుడిని నేనే. నేను కథ వినగానే చెప్పా, ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కాబోతోంది అని మైత్రి నిర్మాతలు రవి గారికి, నవీన్ గారికి చెప్పా. ఈ సినిమాలోని పాత్రకు రవితేజ కాకుండా ఇంకే హీరో సూట్ కాడు అని శివ నిర్వాణకు చెప్పాను. కథను ఎలా అయితే చెప్పాలని అనుకుంటాడో అలాగే తీస్తాడు శివ నిర్వాణ. ఈ సినిమాను ప్రేక్షకులు గెలిపించారు. మంచి కథతో జెన్యూన్ సినిమా తెస్తే అందులో ఐటెం సాంగ్స్, కమర్షియల్ యాంగిల్స్ అవసరం లేదని తెలుగు ప్రేక్షకులు నిరూపించారు. ఇరుముడి సినిమా ఇండియా మొత్తాన్ని వణికించింది. టాలీవుడ్ లో శివ నిర్వాణ మోస్ట్ రిస్పెక్టబుల్ డైరెక్టర్ అవుతాడు. రవితేజ చాలా తెలివైనోడు. కథలో డెప్త్ ఈజీగా ఆయన పసిగట్టగలడు. దాదాపు అందరు తెలుగు దర్శకులకు ఛాన్స్ ఇచ్చింది ఆయనొక్కడే. రవితేజకు సక్సెస్ వస్తే మేమంతా ఇండస్ట్రీకి సక్సెస్ వచ్చినట్లు ఫీల్ అవుతాం'' అన్నారు.  

యాక్టర్ అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. ''జనాలు హాల్ కి రావట్లేదు, ఓటీటీల్లోనే చూస్తున్నారు అనేది అబద్దం. కొడితే కుంభ స్థలం బద్దలవ్వాలి. ఇరుముడి అదే నిరూపించింది. ఒక దర్శకుడికి ఉండాల్సిన దార్శనికత శివ నిర్వాణకు ఉంది. ఇరుముడి కథలో ఉన్న దమ్ము, నిజ జీవితంలోని భావోద్వేగాలు ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. ఇది కదా కథ అంటే. మళ్ళీ పాత రోజులు రాబోతున్నాయి. ఈ సినిమా సక్సెస్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకి థ్యాంక్స్'' అన్నారు.

సాయి కుమార్ మాట్లాడుతూ.. ''శుభ సాయంత్రం. ఇరుముడి సినిమాను ఆదరించి అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. శివ, ఇంత గొప్ప క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా గర్వ పడుతున్నా. ఇప్పటికీ ఈ సినిమా గురించి ఎందరో మెసేజెస్ పెడుతున్నారు. ఈ సినిమాలోని ప్రతి ఒక్కరూ ఎంతో గొప్పగా నటించారు. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా హిట్ అయితే ప్రపంచం చూస్తుందని రవితేజకు చెప్పాను. అదే నిజమైంది. మొన్న తిరుపతి వెళితే ప్రతి ఒక్కరూ గురు స్వామి అని అంటుండటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి, ఇండస్ట్రీ గొప్పగా ఉండాలి, సో హాపీ. స్వామియే శరణం అయ్యప్ప'' అన్నారు.                  

ఇరుముడి సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు సంగీతం అందించడం అదృష్టంగా భావిస్తున్నా. శివ నిర్వాణ కథను ఎంతో అద్భుతంగా మలిచారు. అందరికీ థ్యాంక్స్ అన్నారు. అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం ప్రచారానికి ఏం మాట్లాడిన అవసరం లేదు. ఈ సినిమాలో యాలాల పాట రాశాను. ఏ హుక్ స్టెప్ లేని ఈ పాటకు 2 లక్షల రీల్స్ చేశారనే ఆ విజయం మీరే అర్థం చేసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన శివ నిర్వాణం గారికి స్పెషల్ థ్యాంక్స్ అన్నారు.

యాక్టర్ బేబీ నక్షత్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా సక్సెస్ లో భాగం అయిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన శివ నిర్వాణ గారికి, మైత్రి నిర్మాతలకు స్పెషల్ థాంక్స్ అన్నారు.

హీరోయిన్ ప్రియా భవాని శంకర్ మాట్లాడుతూ.. ఇరుముడి సినిమా సక్సెస్ మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో భాగంగా కావడం ఎంతో సంతోషాన్నిచ్చింది. రవితేజ, శివ నిర్వాణతో పాటు చిత్ర యూనిట్ మొత్తం ఎంతో సపోర్ట్ చేసింది. ఈ సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకు స్పెషల్ థ్యాంక్స్ అన్నారు.

నిర్మాత నవీన్, రవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. 20 రోజుల నుంచి చాలా సంతోషంగా ఉన్నాం. ఇరుముడి సినిమా చేసే అవకాశం మాకు రావడం నిజంగా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి, శివ నిర్వాణకు స్పెషల్ థ్యాంక్స్. సాయి కుమార్, అజయ్ ఘోష్, రవితేజ, ప్రియా సహా ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరూ ఎంతో క్షటపడి మంచి అవుట్ పుట్ ఇచ్చారు. సినిమాకు పూనకం వస్తే బ్లాక్ బస్టర్, ఆడియన్స్ కి పూనకం వస్తే ఇరుముడి అనే ఉదాహరణలు ఎన్నో విని చాలా సంతోష పడ్డాము అన్నారు.

డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ సినిమా గురించి చాలా మాట్లాడాము. ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. గత 20 రోజులుగా ఇండస్ట్రీ నుంచి చాలా మంది కాల్ చేసి ప్రశంసించారు. రవితేజతో ఇలాంటి సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. కోన వెంకట్, బీవీఎస్ రవికి స్పెషల్ థాంక్స్. నేను నమ్మేది ఒక్కటే, ఒక పనిని నిజాయితీగా చేస్తే సక్సెస్ అదే వస్తుంది. ఫ్యచర్ లో కూడా ఇలాంటి ఎన్నో సినిమాలు తీస్తా అని నమ్మకంగా చెబుతున్నా అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com