కువైట్‌లో భారీగా కల్తీ, నాణ్యత లేని ఆహారం ధ్వంసం..!!

- September 11, 2026 , by Maagulf
కువైట్‌లో భారీగా కల్తీ, నాణ్యత లేని ఆహారం ధ్వంసం..!!

కువైట్ : ప్రజారోగ్యానికి హాని కలిగించే, కల్తీ చేసిన ఆహార పదార్థాలపై కువైట్ అధికారులు కొరడా ఝళిపించారు. క్యాపిటల్‌, ఫర్వానియా గవర్నరేట్లలో పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్‌ (PAFN) నిర్వహించిన తనిఖీల్లో భారీగా నాణ్యత లేని, కల్తీ ఆహార పదార్థాలను గుర్తించారు. క్యాపిటల్ గవర్నరేట్‌ ఇన్‌స్పెక్షన్‌ విభాగం తనిఖీల్లో మానవ వినియోగానికి అనర్హమైన ఆహారం, పాడైపోయిన ఉత్పత్తులు గుర్తించారు. వాటి సహజ లక్షణాలైన రంగు, ఆకారం, వాసన మారిపోయినట్లు అధికారులు తెలిపారు. అలాగే కల్తీ చేసిన ఆహార పదార్థాలు, సరైన లేబుల్స్‌ లేని ఉత్పత్తులు, ఆహార సంస్థల్లో సాధారణ ఆరోగ్య, పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలను కూడా అధికారులు గుర్తించారు.

108,040 కిలోల ఆహారం ధ్వంసం

తనిఖీల్లో మొత్తం 108,040 కిలోల నాణ్యత లేని, కల్తీ ఆహార పదార్థాలను అధికారులు ధ్వంసం చేశారు. మరోవైపు ఫర్వానియా గవర్నరేట్‌లో నిర్వహించిన తనిఖీల్లో ఆరోగ్య లైసెన్స్‌ లేకుండా ఆహార ఉత్పత్తులను విక్రయిస్తూ, సరైన ఆరోగ్య ధ్రువపత్రాలు లేకుండా ఆహార వ్యాపారం చేస్తున్న ఓ సంస్థపై అధికారులు ఉల్లంఘన నివేదిక నమోదు చేశారు.

వినియోగదారుల భద్రతే లక్ష్యం

ఆహార సంస్థలు నిర్దేశిత ఆరోగ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా చూడటం, మార్కెట్లోకి వచ్చే ఆహార ఉత్పత్తుల భద్రతను నిర్ధారించడం, వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయని PAFN వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com