బహ్రెయిన్‌లో ఆహార వృథాను తగ్గించేందుకు పిలుపు..!!
- September 12, 2026
మనామా: వ్యర్థాలను తగ్గించి, పరిశుభ్రమైన, సుస్థిరమైన సమాజాలను నిర్మించేందుకు చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని బహ్రెయిన్‌లోని ఐక్యరాజ్యసమితి మానవ నివాసాల కార్యక్రమం (UN-Habitat) పిలుపునిచ్చింది.
ఆహార పంపిణీ, మిగిలిపోయిన ఆహారాన్ని అవసరమైన వారికి అందించడం, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలను నిర్వహించాలనుకునే వ్యక్తులు, సంస్థలు, సంఘాలు తమ కార్యక్రమాలను నమోదు చేసుకోవాలని సూచించింది. ఇలా నమోదు చేసుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే పరిశుభ్రత కార్యక్రమాలతో పాటు స్థానిక కార్యక్రమాలకు కూడా గుర్తింపు లభిస్తుందని పేర్కొంది.
సెప్టెంబర్ 20న వరల్డ్ క్లీనప్ డే
ప్రతి ఏడాది సెప్టెంబర్ 20న వరల్డ్ క్లీనప్ డే నిర్వహిస్తారు. కేవలం చెత్తను తొలగించడమే కాకుండా వ్యర్థాలు ఉత్పత్తి కావడానికి కారణమవుతున్న అలవాట్లు, విధానాలను మార్చడంపై కూడా ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది. ఈ ఏడాది ‘From Clean Plates to Clean Cities’ అనే థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా నగరాలు, సమాజాలను ప్రభావితం చేస్తున్న అతిపెద్ద, నివారించగల వ్యర్థాల్లో ఆహార వ్యర్థాలు కూడా ఒకటిగా ఉన్న నేపథ్యంలో ఈసారి ఆహార వృథాపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.
బహ్రెయిన్లోనూ ఆహార వృథా సమస్య
బహ్రెయిన్‌లో ఆహార వ్యర్థాలు పెద్ద సమస్యగా కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది వందల వేల టన్నుల చెత్తను అస్కర్ ల్యాండ్‌ఫిల్‌కు తరలిస్తున్నారు. ఇందులో ఆహార వ్యర్థాల వాటా 50 శాతం వరకు ఉంటుందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయని UN-Habitat GCC ప్రతినిధి, బహ్రెయిన్ కంట్రీ ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ అయ్మన్ ఎల్ హెఫ్నావి తెలిపారు. ఇందులో యువత పెద్ద ఎత్తున పాల్గొనడం ద్వారా వారి సహచరుల్లోనూ బాధ్యతాయుతమైన అలవాట్లు పెంపొందుతాయని, తాము నివసించే ప్రాంతాల పట్ల బాధ్యతాభావం బలపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇలా కూడా పాల్గొనవచ్చు
వరల్డ్ క్లీనప్ డేలో భాగంగా ప్రజలు పలు రకాల కార్యక్రమాలను నిర్వహించవచ్చని UN-Habitat సూచించింది. వాటిలో.. కమ్యూనిటీ క్లీనప్ కార్యక్రమాలు, కంపోస్టింగ్ కార్యక్రమాలు, ఆహార వ్యర్థాలపై అవగాహన కార్యక్రమాలు, మిగిలిపోయిన ఆహారాన్ని అవసరమైన వారికి పంపిణీ చేయడం, ఇళ్లలో, పాఠశాలల్లో, కార్యాలయాల్లో ఆహార వృథాను తగ్గించడం చేయవచ్చు. ఆహారాన్ని అవసరానికి మించి కొనుగోలు చేయకుండా ఉండటం, వృథాను తగ్గించే విధానాలపై ఇతరులకు అవగాహన కల్పించడం ద్వారా కూడా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని UN-Habitat తెలిపింది.
బహ్రెయిన్ ఫుడ్ బ్యాంక్ కీలక పాత్ర
బహ్రెయిన్‌లో ఇప్పటికే పలు సంస్థలు మిగిలిపోయిన ఆహారం వృథా కాకుండా అవసరమైన వారికి చేరేలా చర్యలు చేపడుతున్నాయి. బహ్రెయిన్ ఫుడ్ బ్యాంక్‌ను నిర్వహిస్తున్న Conserving Bounties Society గత ఏడాది వృథా అయ్యే అవకాశం ఉన్న 230 టన్నుల మిగులు ఆహారాన్ని సేకరించి దేశవ్యాప్తంగా కుటుంబాలు, తక్కువ ఆదాయం కలిగిన కార్మికులకు పంపిణీ చేసింది. అలాగే 2024లో మరో 183 టన్నుల ఆహారాన్ని హోటళ్లు, సూపర్మార్కెట్లు, రెస్టారెంట్లు, కాఫీ షాపులతో కలిసి సేకరించి పంపిణీ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ బిలియన్ భోజనాలు వృథా
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ ఒక బిలియన్కు పైగా భోజనాలు వృథా అవుతున్నాయని UN-Habitat పేర్కొంది. అదే సమయంలో లక్షలాది మంది ఆకలితో బాధపడుతూ, ప్రాథమిక సేవలకు కూడా దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆహారాన్ని పారేయకుండా అవసరమైన వారికి అందేలా చేయడం, ఆహార వృథాను తగ్గించడం మరింత కీలకమని స్పష్టం చేసింది.
వరల్డ్ క్లీనప్ డేను కేవలం ఒకరోజు కార్యక్రమంగా కాకుండా, రోజువారీ జీవితంలో బాధ్యతాయుతమైన అలవాట్లను పెంపొందించి దీర్ఘకాలిక మార్పుకు దోహదపడే అవకాశంగా చూడాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- కువైట్ లైబ్రరీ ప్రాజెక్టులపై సమీక్ష.. ఆక్స్ఫర్డ్ తో చర్చలు..!!
- సౌదీపై దాడుల ఎఫెక్ట్.. ఇరాక్‌లో మైసాన్ ఆపరేషన్స్ కమాండర్ తొలగింపు..!!
- 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!
- ఏ దేశానికి BRICS కూటమి వ్యతిరేకం కాదు: ప్రధాని మోదీ
- ఇక విదేశాల్లోనే ఫుడ్ హ్యాండ్లర్ పరీక్ష.. ఖతార్ కీలక నిర్ణయం..!!
- ఒమన్‌లో అక్రమ ప్రవేశాల వైరల్ వీడియోపై ROP క్లారిటీ..!!
- బహ్రెయిన్‌లో ఆహార వృథాను తగ్గించేందుకు పిలుపు..!!
- యూఏఈ స్కూళ్లలో వాట్సాప్ గ్రూపులకు కొత్త రూల్స్..!!
- ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అల్ మురైఖీతో భారత రాయబారి శ్రీకర్ రెడ్డి భేటీ
- BRICS సదస్సులో ప్రధాని మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ ద్వైపాక్షిక భేటీ







