BRICS సదస్సులో ప్రధాని మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ ద్వైపాక్షిక భేటీ
- September 12, 2026
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శనివారం న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు భేటీ అయ్యారు.
సమావేశానికి భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశానికి ముందు ప్రధాని మోదీ, షేక్ ఖాలెద్ పరస్పరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని అభివాదం చేసుకున్నారు.
షేక్ ఖాలెద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఆయనకు స్వాగతం పలికారు.
భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై చర్చ
షేక్ ఖాలెద్ పర్యటన భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ముఖ్యంగా వాణిజ్యం, ఇంధన భద్రత వంటి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఈ పర్యటన అవకాశం కల్పిస్తుందని తెలిపింది.
ఇరువురు నేతలు ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ రంగాల్లో సానుకూల పరిణామాలపై చర్చించారు. అలాగే పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
రెండు రోజుల బ్రిక్స్ సదస్సు
భారత్ 2026లో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రెండు రోజుల పాటు 18వ బ్రిక్స్ సదస్సు జరుగుతోంది. ‘Building for Resilience, Innovation, Cooperation and Sustainability’ అనే ఇతివృత్తంతో భారత్ ఈ సదస్సును నిర్వహిస్తోంది.
మానవతా కేంద్రిత విధానంతో పాటు బ్రిక్స్ దేశాల మధ్య ఉమ్మడి ప్రాధాన్యతలపై సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, కీలకమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం సదస్సులో ప్రధాన చర్చాంశాలుగా ఉన్నాయి.
ప్రస్తుతం బ్రిక్స్‌లో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూఏఈ సభ్య దేశాలుగా ఉన్నాయి. బెలారస్, క్యూబా, బొలీవియా, కజకిస్థాన్, మలేసియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్థాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.
షేక్ ఖాలెద్ భారత్ పర్యటనకు ముందు జూన్ 16న ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ అయ్యారు. 2026లో ఈ ఇద్దరు నేతలు కలుసుకోవడం ఇది మూడోసారి. అంతకుముందు మేలో మోదీ యూఏఈ పర్యటించగా, జనవరిలో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ భారత్‌లో పర్యటించారు.
తాజా వార్తలు
- ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి సుల్తాన్ అల్ మురైఖీతో భారత రాయబారి శ్రీకర్ రెడ్డి భేటీ
- BRICS సదస్సులో ప్రధాని మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ ద్వైపాక్షిక భేటీ
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం
- 6 ఏళ్ల తర్వాత దిల్లీకి చైనా విమాన సర్వీసులు ప్రారంభం
- నేపాల్‌లో యూఏఈ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ ముమ్మర గాలింపు
- యూఏఈ నుంచి ‘నో ఇండియా ప్రోగ్రామ్’కు ప్రియదర్శిని ఎంపిక
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కొత్త నిబంధనలు..!!
- బిగ్ టికెట్లో భారతీయుడిని వరించిన అదృష్టం..!!
- సౌదీ అరేబియాలో కీలక చమురు పైప్‌లైన్ మూసివేత..!!
- కువైట్ విదేశాంగ మంత్రితో ఖతార్ ప్రధాని ఫోన్లో కీలక చర్చలు..!!







