ఇక విదేశాల్లోనే ఫుడ్ హ్యాండ్లర్ పరీక్ష.. ఖతార్ కీలక నిర్ణయం..!!

- September 12, 2026 , by Maagulf
ఇక విదేశాల్లోనే ఫుడ్ హ్యాండ్లర్ పరీక్ష.. ఖతార్ కీలక నిర్ణయం..!!

దోహా: ఖతార్‌లోని ఆహార రంగంలో పనిచేయాలనుకునే వారికి కీలకమైన సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ఫుడ్ హ్యాండ్లర్ లైసెన్సింగ్ పరీక్షను ఇకపై ఖతార్ వెలుపల కూడా రాసే అవకాశం కల్పించింది. ఇందుకోసం పలు దేశాల్లో గుర్తింపు పొందిన పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో విదేశాల్లో ఉన్న అభ్యర్థులు ఖతార్‌కు వచ్చేముందే ఆహార భద్రతకు సంబంధించిన తమ సామర్థ్యం, అర్హతలను పరీక్షించుకోవచ్చు. ఉద్యోగ నియామకం తర్వాత ఫుడ్ సంస్థలకు సమయం, శ్రమ ఆదా కావడంతో పాటు కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలవుతుంది.

అరబిక్, ఇంగ్లిష్‌లో పరీక్ష

ఫుడ్ హ్యాండ్లర్ లైసెన్సింగ్ పరీక్షను అరబిక్, ఇంగ్లిష్ భాషల్లో నిర్వహిస్తున్నారు. అభ్యర్థి పనితీరుపై వివరణాత్మక నివేదిక కూడా అందిస్తారు. ఇందులో ఆహార భద్రతకు సంబంధించిన వివిధ అంశాల్లో అభ్యర్థి బలాలు, మెరుగుపరుచుకోవాల్సిన అంశాలను వెల్లడిస్తారు. ఈ నివేదికల ఆధారంగా ఉద్యోగికి అవసరమైన శిక్షణను ఫుడ్ సంస్థలు తెలుసుకోవచ్చు. తద్వారా సిబ్బంది నైపుణ్యాన్ని పెంచడంతో పాటు ఆహార భద్రతా ప్రమాణాలను మెరుగ్గా అమలు చేయవచ్చు.

ఖతార్‌లో మళ్లీ పరీక్ష అవసరం లేదు

విదేశాల్లో నిర్వహించే పరీక్షలో అభ్యర్థి ఉత్తీర్ణత సాధించిన తర్వాత, సంబంధిత ఫుడ్ సంస్థ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ లైసెన్స్ జారీకి అవసరమైన తదుపరి ప్రక్రియలను పూర్తి చేసుకోవచ్చు. ఖతార్‌కు వచ్చిన తర్వాత అభ్యర్థి మళ్లీ అదే పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదు. అయితే ప్రస్తుతం విదేశాల్లో పరీక్ష రాయడం ఐచ్ఛికమే అని MoPH స్పష్టం చేసింది. ఫుడ్ రంగంలో ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రస్తుతం ఇది తప్పనిసరి నిబంధన కాదు.

త్వరలో లైసెన్స్ తప్పనిసరి?

ఫుడ్ హ్యాండ్లర్లకు ప్రొఫెషనల్ ప్రాక్టీస్ లైసెన్స్‌ను భవిష్యత్తులో తప్పనిసరి చేయడానికి మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన అమలు తేదీ, విధివిధానాలను అవసరమైన ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ప్రకటించనున్నట్లు MoPH తెలిపింది.

2021 నుంచి అమల్లో కార్యక్రమం

ఖతార్‌లో ఫుడ్ హ్యాండ్లర్ లైసెన్సింగ్ కార్యక్రమం 2021 నుంచి అమల్లో ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10,630 మంది ఫుడ్ హ్యాండ్లర్లకు లైసెన్సులు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫుడ్ రంగంలో పనిచేసే సిబ్బంది సామర్థ్యాన్ని పెంచడం, అర్హత కలిగిన ఉద్యోగులను నియమించుకోవడంలో సంస్థలకు సహకరించడం, ఆహార భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని MoPH తెలిపింది.

ఇక విదేశాల్లో పరీక్ష రాయాలనుకునే ఫుడ్ సంస్థలు, ఉద్యోగులు MoPH వెబ్‌సైట్ ద్వారా కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్ విధానం, గుర్తింపు పొందిన విదేశీ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని తెలుసుకోవచ్చని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com