కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!

- September 13, 2026 , by Maagulf
కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!

కువైట్ : కువైట్ ప్రభుత్వం డ్రోన్లు, లైట్ స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్ స్పోర్ట్స్, వాటికి సంబంధించిన కార్యకలాపాలను నియంత్రించేందుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి, రిజిస్ట్రేషన్, లైసెన్స్ తప్పనిసరి కానుంది. కొత్త చట్టం ప్రకారం.. హోం మంత్రిత్వ శాఖ (Ministry of Interior) ముందస్తు అనుమతి లేకుండా డ్రోన్లు, ఇతర సంబంధిత విమానాలను నడపడం నిషేధం.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి

కువైట్‌లో డ్రోన్ లేదా లైట్ స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వినియోగించాలనుకునే యజమానులు వాటిని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) వద్ద రిజిస్టర్ చేయాలి. అలాగే విమానాన్ని నడిపే ముందు ఎయిర్‌వర్థినెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ఆపరేటర్లు అవసరమైన లైసెన్సులు, అనుమతులు కూడా తీసుకోవాలి. లైసెన్స్ లేదా హోం మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా డ్రోన్లు, సంబంధిత విమానాలను నడిపితే గరిష్ఠంగా 2 ఏళ్ల జైలు శిక్ష, KD 1,000 నుంచి KD 2,000 వరకు జరిమానా లేదా ఈ రెండింటిలో ఏదో ఒక శిక్ష విధించే అవకాశం ఉంది.

అదే విధంగా డ్రోన్లు, వాటికి సంబంధించిన పరికరాలను దిగుమతి చేయడం, తయారు చేయడం, అసెంబుల్ చేయడం, ప్రోగ్రామింగ్ చేయడం లేదా మార్పులు చేయడం కోసం కూడా ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేశారు. అలాగే విమానాశ్రయాలు, నిషేధిత లేదా పరిమిత ప్రాంతాలపై డ్రోన్లను ఎగరేయడాన్ని నిషేధించారు. ప్రత్యేక అనుమతి లేకుండా రాత్రి సమయంలో డ్రోన్లు ఎగరేయడాన్ని కూడా చట్టం నిషేధించింది.

ఇక నిషేధిత ప్రాంతాల్లో లేదా సైనిక, భద్రతా సంస్థల సమీపంలో ఎగురుతూ దేశ భద్రతకు లేదా ప్రజల భద్రతకు ముప్పుగా మారే డ్రోన్లను అడ్డుకోవడం, నిలిపివేయడం, నియంత్రణలోకి తీసుకోవడం లేదా అవసరమైతే కూల్చివేయడం వంటి చర్యలు తీసుకునే అధికారాన్ని భద్రతా, సైనిక సంస్థలకు కొత్త చట్టం కల్పించింది. కొత్త నిబంధనలకు అనుగుణంగా మారేందుకు డ్రోన్, లైట్ స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ యజమానులకు ఒక సంవత్సరం గడువు ఇచ్చారు. ఈ చట్టానికి సంబంధించిన అమలు నిబంధనలను 2026 చివరి నాటికి జారీ చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com