ఖతార్‌లో పేషెంట్ సేఫ్టీకి PHCC కీలక చర్యలు..స్పెషల్ క్యాంపెయిన్..!!

- September 15, 2026 , by Maagulf
ఖతార్‌లో పేషెంట్ సేఫ్టీకి PHCC కీలక చర్యలు..స్పెషల్ క్యాంపెయిన్..!!

దోహా: ఖతార్ ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC) పేషెంట్ సేఫ్టీ క్యాంపెయిన్‌ 2026ను సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు నిర్వహించనుంది. ఖతార్ పేషెంట్ సేఫ్టీ వీక్‌లో భాగంగా, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న నిర్వహించే వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ ఏడాది క్యాంపెయిన్‌ను “సేఫ్ కేర్ ఫర్ నాన్‌కమ్యూనికబుల్ డిసీజెస్” అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. “సేఫ్ కేర్ ఫర్ లైఫ్” అనే గ్లోబల్ మెసేజుతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సురక్షితమైన, నిరంతర వైద్య సేవల ప్రాధాన్యతను తెలియజేయనున్నారు.

డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు వంటి నాన్‌కమ్యూనికబుల్ డిసీజెస్‌కు దీర్ఘకాలిక పర్యవేక్షణ, చికిత్స అవసరమని PHCCలో క్వాలిటీ, పేషెంట్ సేఫ్టీ అండ్ ఇన్నోవేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అమల్ అబ్దుల్లా అల్ అలీ తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో జీవిస్తున్న వారికి సురక్షితమైన వైద్యం అందించేందుకు రోగులు, వైద్య సిబ్బంది మధ్య సమన్వయం ఎంతో అవసరమన్నారు. రోగి చికిత్స ప్రయాణం మొత్తం నాణ్యత, భద్రతకు సంబంధించిన విధానాలను నిరంతరం పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

PHCC డైరెక్టర్ ఆఫ్ రిస్క్ మేనేజ్‌మెంట్, పేషెంట్ సేఫ్టీ అండ్ పేషెంట్ ఎంగేజ్‌మెంట్ నవాల్ ఖత్తాబీ మాట్లాడుతూ.. వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యులు సూచించిన చికిత్సా ప్రణాళికను కచ్చితంగా పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించడమే క్యాంపెయిన్ ప్రధాన లక్ష్యమని వివరించారు. అలాగే రోగులు తమ ఆరోగ్య సంరక్షణలో చురుకైన భాగస్వాములుగా వ్యవహరించేలా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.

క్యాంపెయిన్ సందర్భంగా PHCC ఆరోగ్య కేంద్రాల్లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రోగులు, సందర్శకుల కోసం ఎడ్యుకేషనల్ బూత్‌లు, వైద్య సిబ్బంది కోసం వర్క్‌షాప్‌లు, శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే PHCC సోషల్ మీడియా వేదికల ద్వారా వివిధ విద్యా, డిజిటల్ సమాచారాన్ని ప్రజలకు అందించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com