దుబాయ్: దుబాయ్ పోలీస్ తన లగ్జరీ పెట్రోల్ వాహనాల ఫ్లీట్లోకి మరో అత్యాధునిక సూపర్‌కార్‌ను చేర్చింది. మాన్సోరీ కంపెనీ ప్రత్యేకంగా మోడిఫై చేసిన ‘మాన్సోరీ ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్’ను దుబాయ్ పోలీస్ తమ లగ్జరీ పెట్రోల్ ఫ్లీట్లోకి చేర్చుకుంది. మాన్సోరీతో కలిసి దుబాయ్ పోలీస్ చేపట్టిన లగ్జరీ స్పోర్ట్స్ కార్ల ప్రాజెక్టుల్లో ఇది ఐదో సహకారం.
దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరుగుతున్న అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ATM) తొలి రోజు కార్యక్రమంలో దుబాయ్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డిపార్ట్మెంట్లో క్రిమినల్ సెక్యూరిటీ అఫైర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఒమర్ అలీ అల్ షెహ్హీ ఈ వాహనాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ పోలీస్ టూరిస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ మొహమ్మద్ అబ్దుల్ రహ్మాన్, పలువురు పోలీస్ అధికారులు, మాన్సోరీ జనరల్ మేనేజర్ అహ్మద్ అబాది పాల్గొన్నారు.
800 హార్స్పవర్.. గంటకు 345 కి.మీ వేగం
మాన్సోరీ ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్‌లో 6.5 లీటర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్ఠంగా 800 హార్స్పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈ సూపర్‌కార్ గరిష్ఠంగా గంటకు 345 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు.
వాహనం బాహ్య డిజైన్‌లో సమగ్ర మార్పులు చేసి, మరింత ప్రత్యేకమైన స్పోర్టీ లుక్‌ను అందించారు.
పర్యాటక ప్రాంతాల్లో భద్రతకు మరింత బలం
లగ్జరీ వాహనాలను పెట్రోల్ ఫ్లీట్‌లో చేర్చడం ద్వారా దుబాయ్ పోలీస్ పర్యాటక ప్రాంతాల్లో తమ భద్రతా ఉనికిని మరింత బలోపేతం చేస్తోందని బ్రిగేడియర్ ఒమర్ అల్ షెహ్హీ తెలిపారు. బుర్జ్ ఖలీఫా, షేక్ మహమ్మద్ బిన్ రషీద్ బులేవార్డ్, జేబీఆర్ (JBR) తదితర ప్రముఖ ప్రాంతాల్లో ఈ వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు పోలీసుల భద్రతా సేవలకు మరింత ప్రాధాన్యతను తీసుకువస్తాయని పేర్కొన్నారు.
అదే సమయంలో దుబాయ్ పోలీస్ ఉపయోగించే పెట్రోల్ వాహనాల సాంకేతిక సామర్థ్యాలను ఆధునీకరించడం, వాటి ప్రమాణాలను మరింత మెరుగుపరచడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
మాన్సోరీ వ్యవస్థాపకుడు, సీఈఓ కౌరోష్ మాన్సోరీ మాట్లాడుతూ, జర్మనీలో ప్రధాన కార్యాలయం కలిగిన మాన్సోరీ లగ్జరీ వాహనాల మోడిఫికేషన్, కస్టమైజేషన్ రంగంలో ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్లో ఒకటని తెలిపారు.
దుబాయ్ పోలీస్తో తమ ఐదో సహకారాన్ని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందని, దుబాయ్ పోలీస్ ప్రతిష్ఠాత్మక గుర్తింపుకు అనుగుణంగా ఈ వాహనాలను రూపొందిస్తున్నామని చెప్పారు. ఆవిష్కరించిన ‘మాన్సోరీ ఫెరారీ 812’ను దుబాయ్ పోలీస్ కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు వెల్లడించారు.
ఇప్పటికే నాలుగు లగ్జరీ వాహనాలు
మాన్సోరీతో భాగస్వామ్యంలో దుబాయ్ పోలీస్ గతంలో నాలుగు ప్రత్యేక లగ్జరీ పెట్రోల్ వాహనాలను ఫ్లీట్‌లో చేర్చింది. వీటిలో లంబోర్ఘిని రెవుల్టో 1,070 హార్స్పవర్ శక్తితో, కేవలం 2.4 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకునే హైబ్రిడ్ హైపర్కార్గా నిలిచింది.
2025 చివర్లో ఫెరారీ పురోసాంగ్ను కూడా దుబాయ్ పోలీస్ ఫ్లీట్‌లో చేర్చింది. 755 హార్స్పవర్ సామర్థ్యం కలిగిన ఈ అరుదైన V12 SUVకు ప్రత్యేకమైన వైట్ అండ్ గ్రీన్ పెయింట్, కస్టమ్ పర్పుల్ ఇంటీరియర్, ‘12’ నంబర్ ప్లేట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
2025 అరేబియన్ ట్రావెల్ మార్కెట్ సందర్భంగా రోల్స్ రాయిస్ కల్లినన్‌ను ఆవిష్కరించారు. 610 హార్స్పవర్ సామర్థ్యం కలిగిన ఈ ప్రత్యేక మోడల్ బుర్జ్ ఖలీఫా వంటి ప్రముఖ ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తోంది.
ఇక 2024లో మెర్సిడెస్-AMG G63తో దుబాయ్ పోలీస్–మాన్సోరీ భాగస్వామ్యం ప్రారంభమైంది. మాన్సోరీ ప్రత్యేక వైడ్-బాడీ డిజైన్‌తో పాటు పనితీరును మెరుగుపరిచే సాంకేతిక మార్పులతో ఈ వాహనం రూపొందించబడింది.