కువైట్‌ ఇతరుల లగేజీపై ప్రయాణికులకు కీలక హెచ్చరిక..!!

- September 16, 2026 , by Maagulf
కువైట్‌ ఇతరుల లగేజీపై ప్రయాణికులకు కీలక హెచ్చరిక..!!

కువైట్: విదేశాలకు వెళ్లే, విదేశాల నుంచి కువైట్‌కు వచ్చే ప్రయాణికులకు ఆ దేశ హోంశాఖ (MoI) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇతరుల తరఫున లగేజీ, బ్యాగులు, పార్సిళ్లు లేదా ఇతర వస్తువులను తీసుకెళ్లవద్దని పౌరులు, నివాసితులకు సూచించింది. ఇతరులు ఇచ్చిన వస్తువులను తీసుకెళ్లడం ద్వారా డ్రగ్స్ స్మగ్లర్లు ప్రయాణికులను ఉపయోగించుకునే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కువైట్ పోర్టుల ద్వారా మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను తరలించేందుకు స్మగ్లర్లు వివిధ రకాల దాచిపెట్టే పద్ధతులను ఉపయోగిస్తున్నారని తెలిపింది.

 చట్టపరమైన చర్యలు

ఇతరులు ఇచ్చిన వస్తువుల్లో నిషేధిత పదార్థాలు ఉన్న విషయం ప్రయాణికులకు తెలియకపోయినా, వాటిని తీసుకెళ్లడం చట్టపరమైన బాధ్యతకు దారితీయవచ్చని MoI స్పష్టం చేసింది.
ఇటీవల కువైట్‌కు చేరుకున్న ముగ్గురు ప్రయాణికులను వేర్వేరు కేసుల్లో అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న మెడిసిన్ కంటైనర్లలో దాచిన మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను అధికారులు గుర్తించారు.
ప్రాథమిక దర్యాప్తులో.. నిందితులు కువైట్ వెలుపల ఉన్న వ్యక్తుల నుంచి ఈ పార్సిళ్లను స్వీకరించి, దేశంలో ఉన్న వ్యక్తులకు అందజేయాల్సి ఉన్నట్లు తేలింది. నిషేధిత పదార్థాలను మందుల రూపంలో కనిపించేలా ఉద్దేశపూర్వకంగా దాచినప్పటికీ, తనిఖీల్లో అవి బయటపడ్డాయి.

ఎవరైనా సరే.. వస్తువులు తీసుకెళ్లొద్దు

తమకు తెలిసిన వ్యక్తులు, బంధువులు లేదా ఇతరులు ఎవరైనా సరే.. వారి వస్తువులను విమాన ప్రయాణంలో తీసుకెళ్లవద్దని హోంశాఖ ప్రయాణికులను కోరింది. వారు చెప్పే కారణం ఏదైనా, వస్తువుల స్వభావం ఏదైనా వాటిని స్వీకరించి రవాణా చేయకుండా ఉండాలని సూచించింది. అరెస్టయిన వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న నిషేధిత పదార్థాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com