వడోదర నుంచి వారణాసి వరకు మోదీ విజయ ప్రస్థానం
- September 16, 2026
“రాజు పదునైన వ్యూహాలతో శక్తిమంతుడిగా ఉంటే ఆ రాజ్యం పురోగతి సాధించడమే కాకుండా, శత్రు దేశాలు కన్నెత్తి చూడడానికి కూడా జంకుతాయి..” అని రాజనీతిజ్ఞడు చాణుక్యుడు చెప్తారు. ఇప్పుడు అదే తరహాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలన సాగుతున్నది. ఒక సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన నరేంద్ర మోదీ ప్రయాణం... గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధానమంత్రి పదవి వరకు ఎదిగిన ప్రస్థానం.. వడోదర నుంచి వారణాసి వరకు సాగిన రాజకీయ ప్రస్థానం.. ఎన్నికల్లో ఓటమి ఎరుగని నాయకుడిగా నిలిచిన ప్రస్థానం.. ఇప్పుడు ‘వికసిత్ భారత్-2047’ సంకల్పంతో ముందుకు సాగుతోంది. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ 2026 అక్టోబర్ 7న ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటారు. సెప్టెంబర్ 17న 76వ జన్మదినాన్ని జరుపుకోనున్న మోదీకి ఈ రెండు సందర్భాలు రాజకీయ మైలురాళ్లుగానే కాదు, గత పన్నెండేళ్లలో దేశంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వడ్నగర్లో జన్మించిన నరేంద్ర దామోదరదాస్ మోదీ ఒక్క రోజూ కూడా సెలవు తీసుకోకుండా గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు తన రాజకీయ ప్రస్థానాన్ని విస్తరించి, వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా దేశాన్ని నడిపిస్తున్న తీరు అపూర్వం.
గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ తొలి దశ పాలనలో 2001 జనవరి 26న సంభవించిన భుజ్ భూకంపం ఆయనకు అగ్నిపరీక్షగా నిలిచింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విపత్తు సమయంలో సహాయక, పునరావాస చర్యలను వేగవంతం చేయడంతో పాటు, దెబ్బతిన్న మౌలిక వసతుల పునర్నిర్మాణంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. భూకంపం అనంతరం మోదీ నాయకత్వంలో చేపట్టిన గుజరాత్ పునర్నిర్మాణం దేశంలోనే ఒక ముఖ్యమైన విపత్తు నిర్వహణ నమూనాగా గుర్తింపు పొందింది. 2001 నుండి గుజరాత్ సీఎంగా 13 ఏళ్లపాటు పనిచేసిన మోదీ 2014లో తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి, 2019లో రెండోసారి, 2024లో మూడోసారి వరుసగా ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చారు. 2026 జూన్ 10వ తేదీ నాటికి నిరాటంకంగా 4399 రోజులు భారత ప్రధానిగా పనిచేసిన నాయకుడిగా మోదీ రికార్డు సృష్టించారు. ఈ 25 ఏళ్ల ఆయన రాజకీయ ప్రయాణంలో నిర్ణయాత్మక నాయకత్వం, సంస్థాగత విస్తరణ, ప్రజా భాగస్వామ్యం, టెక్నాలజీ వినియోగం, ప్రజా సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల విస్తరణ ప్రధాన అంశాలుగా నిలిచాయి. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ నుంచి మొదలై ఇప్పుడు ‘వికసిత్ భారత్-2047’ లక్ష్యంగా కొనసాగుతోంది.
పేదలు, రైతులు, మహిళలు, యువత, మధ్యతరగతి వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంపై మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రైతు సంక్షేమానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కీలక పథకంగా నిలిచింది. అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6 వేల చొప్పున మూడు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. 2026 జూన్‌లో విడుదలైన 23వ విడతలో 9.44 కోట్ల మందికి పైగా రైతులకు రూ.18,880 కోట్లకు పైగా బదిలీ కాగా, అందులో 2.18 కోట్లకు పైగా మహిళా రైతులు ఉండడం విశేషం. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం రూ.4.46 లక్షల కోట్లు అన్నదాతలకు అందించారు. పంట బీమా, ఈ-నామ్, మట్టి ఆరోగ్య కార్డులు, సాగునీటి విస్తరణ వంటి కార్యక్రమాలు కూడా వ్యవసాయ రంగానికి తోడ్పడుతున్నాయి.
మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్న మోదీ ప్రభుత్వం ఉజ్వల యోజన కింద పేద మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించడం ద్వారా సంప్రదాయ వంట ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించారు. 2026 ఆగస్టు నాటికి 10.57 కోట్లకు పైగా ఉజ్వల కనెక్షన్లు అందాయి. జనధన్ ఖాతాలు 2026 ఆగస్టు 12 నాటికి 58.90 కోట్లకు చేరాగా, వీటిలో 32.68 కోట్ల ఖాతాలు మహిళలవే. మహిళలకు రాజకీయ అధికారాలు ఇవ్వాలనే సంకల్పంతో మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరలో కార్యరూపం దాలుస్తుందనే ఆశలున్నాయి. స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాలు యువతకు ఊతమిస్తున్నాయి. 2026 నాటికి ముద్ర కింద 59 కోట్లకు పైగా రుణాలు మంజూరవగా, వాటి మొత్తం విలువ రూ.40 లక్షల కోట్లకు పైగానే ఉంది. వీధి వ్యాపారుల నుంచి సూక్ష్మ పారిశ్రామికవేత్తల వరకు ఆర్థిక అవకాశాలను విస్తరించేందుకు పీఎం స్వనిధి, ముద్ర వంటి పథకాలు మధ్యతరగతికి ఉపయోగపడుతున్నాయి. పీఎం ఆవాస్, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్ వంటి చర్యలు సంక్షేమ పాలనకు మరో కోణంగా నిలిచాయి.
మోదీ ప్రభుత్వంలో డిజిటల్ ఇండియా దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్నే మార్చింది. ఆధార్, జనధన్, మొబైల్, యూపీఐ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కలయికతో ప్రభుత్వ ప్రయోజనాలు నేరుగా ప్రజలకు చేరే వ్యవస్థ బలోపేతమైంది. చిన్న దుకాణం నుంచి పెద్ద వ్యాపారం వరకు డిజిటల్ చెల్లింపులు విస్తరించాయి. జీఎస్టీతో దేశవ్యాప్తంగా పన్ను వ్యవస్థలో ఏకరూపత వచ్చింది. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ నిషేధం, పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం, కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వంటి నిర్ణయాలు మోదీ ప్రభుత్వ పాలనలో ప్రత్యేక రాజకీయ మైలురాళ్లుగా నిలిచాయి.
దేశ భద్రత విషయంలోనూ మోదీ ప్రభుత్వం కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నది. 2016 ఉరీ ఉగ్రదాడి అనంతరం నియంత్రణ రేఖ దాటి సర్జికల్ స్ట్రైక్స్, 2019 పుల్వామా దాడి తర్వాత బాలాకోట్ వైమానిక దాడులు, 2025 పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాల దాడులు చేశాయి. గతంతో పోలిస్తే మోదీ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదంపై భారత్ ప్రతిస్పందన మరింత స్పష్టంగా, దృఢంగా తయారయ్యింది.
జాతీయ రహదారులు, రైల్వేలు, వందేభారత్ రైళ్లు, విమానాశ్రయాలు, మెట్రోలు, పోర్టులు, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, పీఎం గతిశక్తి వంటి ప్రాజెక్టులు దేశ కనెక్టివిటీని కొత్త దశకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగమయ్యాయి. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, పీఎలఐ విధానాలతో ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, రక్షణ ఉత్పత్తులు, సెమీకండక్టర్లు వంటి రంగాల్లో దేశీయ తయారీకి ప్రాధాన్యం పెరిగింది. పట్టణాభివృద్ధిలో స్మార్ట్ సిటీస్ మిషన్ ద్వారా డిజిటల్ సేవలు, స్మార్ట్ రోడ్లు, నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ల వంటి మౌలిక వసతులు అభివృద్ధి చెందాయి.
క్లిష్ట సమయాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. కరోనా మహమ్మారి సమయంలోనూ, పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన, సరఫరా సంక్షోభం తలెత్తిన సమయంలోనూ మోదీ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించి దేశ ప్రజలకు అండగా నిలిచింది. కరోనా సమయంలో ఉచిత ఆహార ధాన్యాల పంపిణీతో పాటు భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టి, 93.5 కోట్లకుపైగా టీకా డోసులను అందించింది. అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం భారత్‌పై పడకుండా ఇంధన సరఫరా, ఆర్థిక స్థిరత్వం, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సంక్షోభ నిర్వహణలో తన సామర్థ్యాన్ని చాటుకుంది.
ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర-రాష్ట్ర సమన్వయం కొత్త ప్రాజెక్టులకు ఊతమిస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో అమరావతి అభివృద్ధికి 2025 మే నెలలో ప్రధానమంత్రి రూ.58,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఇప్పటివరకు రూ.20,658 కోట్ల మేర ఆర్థిక సహాయం అందడంతో పనులు వేగవంతంగా సాగుతున్నాయి. 2026-27లో ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధికి రూ.10,134 కోట్ల కేటాయించారు. 2026ఆగస్టులో రూ.17,900 కోట్లతో నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరిచింది.
దేశ రాజకీయాల్లో ఓటమి ఎరుగని నాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్న మోదీకి ఈ ప్రయాణం కేవలం పదవుల పరంపర కాదు.. సంక్షోభ సమయంలో సేవా సంకల్పం, నిర్ణయాల్లో కఠినత్వం, పేదల సంక్షేమం, రైతుకు భరోసా, మహిళకు సాధికారత, యువతకు అవకాశాలు, దేశానికి భద్రత, అభివృద్ధికి వేగం అనే అంశాలతో ముడిపడిన పాలనా ప్రస్థానం. ఇప్పుడు ‘వికసిత్ భారత్-2047’ లక్ష్యం ఆయన ముందున్న మరో మహత్తర అధ్యాయం. ప్రపంచ వేదికపై భారతదేశాన్ని మరింత శక్తిమంతంగా, అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టి భారత్ ను విశ్వగురువుగా మరల్చాలనే ఆయన సంకల్పం త్వరలో కార్యరూపం దాలుస్తుంది.
--లింగమనేని రమేష్,
పార్లమెంట్ సభ్యులు (రాజ్యసభ), జనసేన పార్టీ.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్
- కువైట్ ఇతరుల లగేజీపై ప్రయాణికులకు కీలక హెచ్చరిక..!!
- ఓజోన్ పొర పరిరక్షణకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







