అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!

- September 18, 2026 , by Maagulf
అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!

అబుదాబి: హాలిడే హోమ్‌ల నిర్వహణకు సంబంధించి అబుదాబి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. హాలిడే హోమ్‌లను నిర్వహించేందుకు అర్హత ఉన్న వ్యక్తులు, సంస్థల పరిధిని విస్తరించడంతో పాటు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో చేసే ప్రకటనల విషయంలో మరింత పారదర్శకతను తప్పనిసరి చేసింది. 2026 అరేబియన్ ట్రావెల్ మార్కెట్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం – అబుదాబి (DCT Abu Dhabi) సందర్భంగా ఈ సవరించిన నిబంధనలను ప్రకటించింది. హాలిడే హోమ్ రంగానికి సంబంధించిన అర్హత, లైసెన్సింగ్, నిర్వహణ బాధ్యతలు, తనిఖీలు, నిబంధనల అమలు వంటి అంశాలను ఈ కొత్త మార్గదర్శకాల్లో స్పష్టంగా వివరించారు. 
 
హాలిడే హోమ్‌ను ఎవరు నిర్వహించవచ్చు?
కొత్త నిబంధనల ప్రకారం  వ్యక్తిగత ఆస్తి యజమానులు, జాయింట్ ఓనర్లు, చట్టబద్ధమైన సంస్థలు, అద్దెదారులు,  ఆస్తి యజమాని నుంచి అధికారికంగా అనుమతించిన వ్యక్తులు  హాలిడే హోమ్‌లను నిర్వహించేందుకు అర్హులు: అయితే వీరంతా DCT Abu Dhabi నిర్దేశించే నిబంధనలు, షరతులను పాటించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ లిస్టింగ్‌పై కీలక నిబంధన
హాలిడే హోమ్‌ను వెబ్‌సైట్ లేదా ఏదైనా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ప్రకటనగా ఉంచాలంటే చెల్లుబాటు అయ్యే DCT Abu Dhabi లైసెన్స్ తప్పనిసరి. అంతేకాకుండా, ఆ హాలిడే హోమ్ లిస్టింగ్ పేజీలో లైసెన్స్ నంబర్‌ను స్పష్టంగా ప్రదర్శించాలి. దీంతో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ముందు ఆస్తి అధికారికంగా లైసెన్స్ పొందిందా లేదా అనేది సందర్శకులు సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది. డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో నిబంధనల అమలును కూడా ఇది మరింత బలోపేతం చేయనుంది.

మరోవైపు అబుదాబిలో హాలిడే హోమ్ రంగం వేగంగా విస్తరిస్తోంది. 2025లో హాలిడే హోమ్‌ల సరఫరా అంతకుముందు ఏడాదితో పోలిస్తే 77 శాతం పెరిగింది. దీంతో 2,000కు పైగా కొత్త అర్హత కలిగిన ప్రాపర్టీలు చేరాయి. 2025 చివరి నాటికి మొత్తం 4,771 హాలిడే హోమ్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో అతిథుల సంఖ్య కూడా 77 శాతం పెరిగి 335,000కు పైగా నమోదైంది.

ఇక దేశీయ అతిథులు 114 శాతం పెరిగి 82,900కి చేరారు. అంతర్జాతీయ సందర్శకులు 68 శాతం పెరిగి 252,500కి చేరారు.సగటు రోజువారీ ఆదాయం 28 శాతం పెరిగి AED 1,887కి చేరింది. DCT అబుదాబి ప్రకారం, కొత్త నిబంధనలు హాలిడే హోమ్ రంగంలో బాధ్యతాయుతమైన మార్కెట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు భద్రత, నాణ్యత, అతిథుల అనుభవానికి సంబంధించిన ప్రమాణాలను కొనసాగించేందుకు ఉద్దేశించబడ్డాయని పేర్కొన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com